అజ్ఞాతంలోకి రవి ప్రకాశ్.. సెల్‌ఫోన్లు స్విచ్‌ఆఫ్.. ఇంటికెళ్లిన పోలీసులు

ఫోర్జరీ కేసులో రెండవసారి నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరుకాలేదు టీవీ 9 మాజీ సీఈవో రవి ప్రకాశ్, సినీ హీరో శివాజీ. ఈ నెల(మే) 9వ తేదీన తొలిసారి విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసిన సైబరాబాద్ పోలీసులు విచారణకు హాజరు కాలేమంటూ ఆయన తరపు లాయర్ 10 రోజుల గడువు కోరారు. అయితే గడువు ఇచ్చేందుకు నిరాకరించిన పోలీసులు రెండవసారి కూడా నోటీసులు ఇచ్చారు. అయితే, రెండవసారి కూడా రవిప్రకాశ్, శివాజీలు విచారణకు హాజరుకాలేదు.
రవిప్రకాశ్, మూర్తి, శివాజీలు ముగ్గురికి పోలీసులు నోటీసులు ఇవ్వగా.. మూర్తి మాత్రమే విచారణకు హాజరయ్యారు. దీంతో రవిప్రకాశ్, శివాజీలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని సైబరాబాద్ పోలీసులు భావిస్తున్నారు. ఫోర్జరీ కేసుకు సంబంధించి తెలుసుకునేందుకు రవిప్రకాశ్ కోసం సైబరాబాద్ ప్రత్యేక పోలీస్ టీమ్, సైబర్ క్రైమ్ అధికారులు బంజారాహిల్స్‌లోని ఆయన ఇంటికి వెళ్లారు. ఆయనను మేనేజ్‌మెంట్ సీఈఓ పదవి నుంచీ తప్పించింది కాబట్టి ఇంట్లో ఉండొచ్చని పోలీసులు అంచనా వేశారు.
కానీ ఆయన బయటకు వెళ్లారనీ, ఎక్కడికి వెళుతున్నారో తమకు చెప్పలేదని ఇంట్లో వాళ్లు వెల్లడించారు. రవిప్రకాశ్ తన సెల్‌ఫోన్లను కూడా స్విచ్‌ఆఫ్ చేసుకున్నారని, సిమ్ కార్డులను తీసివేసి ఉండడంతో ట్రేస్ చేయడానికి పోలీసులు ఇబ్బంది పడుతున్నారని తెలుస్తుంది.