సై : సీఎం కేసీఆర్ ఆదేశిస్తే చర్చలకు సిద్ధం

ప్రభుత్వం, ఆర్టీసీ మధ్య చర్చలు జరగాలని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేకే అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు తనను బాధించాయన్నారు. తాను సోషలిస్టునన్న కేకే.. సీఎం కేసీఆర్ ఆదేశిస్తే మధ్యవర్తిగా చర్చలు జరుపుతానన్నారు. తన ప్రెస్ రిలీజ్‌కు ముందు, తర్వాత సీఎం కేసీఆర్‌తో మాట్లాడలేదని కేకే అన్నారు.
కేకే వైఖరి చూస్తుంటే.. సమ్మె విరమణకు ప్రభుత్వం, ఆర్టీసీ మధ్య మళ్లీ చర్చలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులు చర్చలకు సిద్ధపడాని కేకే లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ లేఖపై ఆర్టీసీ కార్మిక సంఘాలు సానుకూలంగా స్పందించాయి. కేకే మధ్యవర్తిత్వం వహిస్తే చర్చలకు సిద్ధమేనని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీని ప్రభుత్వం మళ్లీ చర్చలకు పిలుస్తుందా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి కేకేను టీఆర్ఎస్ అధిష్టానమే రంగంలోకి దింపినట్లు ప్రచారం జరుగుతోంది.
ఆర్టీసీ సమ్మెపై ఎంపీ కేశవరావు రాసిన లేఖపై జేఏసీ నేతలు స్పందించారు. కేశవరావు అంటే తమకు గౌరవం ఉందన్నారు. ఆయన ఎక్కడికి పిలిచినా చర్చకు వస్తామని ప్రకటించారు. టీఎన్జీఓ నాయకులతో తాము సమ్మెకు వెళ్లే ముందు ఫోన్ లో మాట్లాడామని, కానీ ఇప్పుడు మాట్లాడలేదని టీఎన్జీవో నేతలు మాట మార్చడం బాధాకరమని ఆర్టీసీ జేఏసీ నేతలు వాపోయారు.