ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ప్రత్యేకత ఇదే

బతుకమ్మ పండుగ సంబురాలు ప్రారంభమై ఇప్పటికే ఆరు రోజులు గడిచాయి. ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ వేడుకలు ముగిశాయి. ఈరోజు ఏడవ రోజు ‘వేప కాయల బతుకమ్మ’ పండుగను తెలంగాణ ఆడబిడ్డలకు వైభవంగా జరుపుకుంటారు. ఏడవరోజు బతుకమ్మను తంగేడు, గునుగు, చామంతి, గులాబి పూలతో ఏడంతారాలు పేర్చి ఆటపాటలతో అలరించి నీటిలో నిమజ్జనం చేస్తారు.
వేపకాయల బతుకమ్మకు నైవేద్యంగా బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లు ఆకారంగా తయారుచేసి నైవేద్యంగా సమర్పిస్తారు. వాటినే పేరంటాళ్లలు వాయనంగా ఇచ్చుకుంటారు. లేదా పప్పు, బెల్లంలను కూడా బతుక్మకు నైవేద్యంగా పెడతారు.
ప్రతీ ఇంట్లోను పూల జాతర అన్నట్లుగా ఉంటుంది. రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి తమ కష్టసుఖాలను పాటల రూపంలో బతుకమ్మకు చెప్పుకుంటారు. ఎంగిలిపూల బతుకమ్మగా ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు తొమ్మిదవ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఇలా ఈ సంవత్సరం ఆదివారం (అక్టోబర్ 6)న ముగుస్తాయి. సద్దుల బతుకమ్మ వేడుకలకు హైదాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర తీరం అంతా అత్యంత శోభాయమానంగా జీహెచ్ ఎంసీ తీర్చిదిద్దుతోంది.
ఆదిశక్తికి ఆశ్వీజంలో చేసే పుష్పార్చనే బతుకమ్మ పండుగ. నవరాత్రుల్లో బతుకమ్మను ఆరాధించి అనుగ్రహం పొందుతారు తెలంగాణ ఆడపడుచులు. బతుకమ్మలో ఏడోరోజు ప్రత్యేకత వేపకాయల బతుకమ్మ. వేపచెట్టు సాక్షాత్తు శక్తి స్వరూపంగా ఎల్లమ్మగా తెలంగాణలో ఆరాధిస్తారు. ఆ శక్తి రూపానికి ప్రతీకగా శుక్రవారం ఏడవరోజు వేపకాయల బతుకమ్మను పేర్చి చక్కగా ఆడి పాడటం తెలంగాణ ఆడబిడ్డలకు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు.