సింధూశర్మ కేసు : కౌన్సెలింగ్ సెంటర్‌లో పాప కోసం భార్యభర్తల తోపులాట

హైదరాబాద్ : పెద్ద కుమార్తె రిషిత కోసం తల్లి సింధూశర్మ చేస్తున్న పోరాటం మళ్లీ మొదటికి వచ్చింది. పెద్ద పాప రిషితను సింధూశర్మకు అప్పగించేందుకు భర్త వశిష్ట నిరాకరించాడు. రిషితను అప్పగించే వరకు ఆందోళన కొనసాగిస్తానని సింధూశర్మ స్పష్టం చేసింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి రామ్మోహన్ రావు కుటుంబసభ్యులకు, వారి కోడలు సింధూశర్మ కుటుంబసభ్యులకు నాంపల్లిలోని భరోసా చైల్డ్ హెల్ప్ లైన్ సెంటర్ లో కౌన్సిలింగ్ జరిగింది. ఈ సందర్భంగా అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది. కూతురు రిషిత కోసం తల్లిదండ్రుల మధ్య తోపులాట జరిగింది. పాపను లాక్కునేందుకు పోటీలు పడ్డారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. రిషితను తీసుకునేందుకు సింధూశర్మ, ఆమె కుటుంబసభ్యులు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాన్ని భర్త వశిష్ట, ఆమె తండ్రి రామ్మోహన్ రావు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
ఆదివారమే (ఏప్రిల్ 28,2019) చిన్నపాపను సింధూశర్మకి అప్పగించిన రామ్మోహన్ రావు కుటుంబసభ్యులు పెద్ద పాప రిషితను అప్పగించేందుకు అంగీకరించలేదు. ఈ కౌన్సిలింగ్ అంతా వన్ సైడ్ గా జరిగిందని సింధూశర్మ మండిపడింది. తన మామ, రిటైర్డ్ జడ్జి రామ్మోహన్ రావు పలుకుబడికి అధికారులు దాసోహం అయ్యారని ఆరోపించింది. కౌన్సిలింగ్ హాల్ లో రిషిత తన దగ్గరికి వస్తుంటే.. భర్త వశిష్ట బలవంతంగా తీసుకెళ్లాడని సింధూశర్మ వాపోయింది.
పిల్లల కోసం, అత్తింటి వారి వేధింపులపై సింధూశర్మ పోరాటం చేస్తోంది. పెద్ద కుమార్తెను తనకు అప్పగించాలని కోరుతోంది. ఇప్పటికే చైల్డ్ హెల్ప్ లైన్ ద్వారా చిన్న కుమార్తెను దక్కించుకున్న సింధూశర్మ… పెద్ద కుమార్తె కోసం పోరాటం చేస్తోంది. పెద్ద కుమార్తె రిషితను అప్పగించే విషయంలో ఇరు కుటుంబాలకు చైల్డ్ హెల్ప్ లైన్ కౌన్సిలింగ్ నిర్వహిస్తోంది. సోమవారం (ఏప్రిల్ 29,2019) సింధూశర్మ.. తన తల్లిదండ్రులతో భరోసా సెంటర్‌కు వచ్చింది. రిటైర్డ్ జడ్జి రామ్మోహన్ రావు కుటుంబసభ్యులూ వచ్చారు. న్యాయవాదుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.
చిన్నపాప శ్రీ విద్యను తల్లి సింధూశర్మకు పోలీసులు అప్పగించారు. పెద్ద కుమార్తె రిషిక అప్పగింతపై చర్చలు కొనసాగుతున్నాయి. పెద్ద కూతురుని అప్పగించాలా వద్దా అన్నది భరోసా సెంటర్‌లో నిర్ణయించనున్నారు. సింధూశర్మ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ నూతి రామ్మోహన్‌రావు ఇంటి ముందు ఆదివారం (ఏప్రిల్ 28, 2019) ధర్నాకు దిగింది. తన ఇద్దరు కూతుళ్లను అప్పగించాలని డిమాండ్ చేసింది. సింధూశర్మ ధర్నాకు మహిళా సంఘాలు మద్దతు పలికాయి. సింధూశర్మకు కూతుళ్లను అప్పగించాలని డిమాండ్ చేశారు. చిన్నపాపను అప్పగించిన నూతి రామ్మోహన్ రావు కుటుంబసభ్యులు పెద్ద పాపను మాత్రం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. పెద్ద కూతురికి అన్ని విషయాలు తెలుసని.. తనపై ఎలా దాడి చేశారో కూడా తెలుసని సింధూ చెబుతోంది. అన్ని విషయాలు బయటపెడుతుందనే పెద్ద పాపను తనకు అప్పగించడం లేదని, తమను బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారని సింధూ వాపోయింది. పెద్దపాపను తనకు అప్పగించకపోతే తాను కోర్టుకు వెళ్తానని సింధూ స్పష్టం చేసింది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్ రావుపై కోడలు సింధూ శర్మ వరకట్న వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన భర్త, అత్తమామలు కలిసి తనను మానసికంగా, శారీకరంగా వేధిస్తున్నారని పోలీసులకు కంప్లయింట్ చేసింది.