కబ్జా కోరల్లో అమీన్‌పూర్ చెరువు : YCP ఎమ్మెల్యే కాటసాని పేరిట బోర్డులు

Special Ground Report On Ameenpur Lake : అక్రమ నిర్మాణాలకు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. అడ్డు అదుపు లేకుండా ల్యాండ్ మాఫియా ఏ ప్రాంతాన్ని వదలడం లేదు. కన్నుపడితే చాలు ఎలాంటి భూమినైన కాజేస్తోంది. పటాన్‌చెరులోని అమీన్‌పూర్‌లో చెరువుల భూములు క్రమంగా మాయమైపోతున్నాయి. తమకు కావాల్సిన భూమిని కబ్జా చేసేందుకు కబ్జా రాయుళ్లు ఎంతటికైనా తెగిస్తారు. మరోవైపు ప్రజల కోసం పని చేయాల్సిన ప్రభుత్వాధికారులు, నిబంధనలను యథేచ్ఛగా ల్యాండ్ మాఫియాకు అనుకూలంగా మారుస్తూ.. ఇటు ప్రభుత్వాలను అటు చట్టాలను మోసం చేస్తున్నారని విమర్శలున్నాయి.
కుతుబ్ షాహీల కాలంలో రైతుల కోసం పటాన్‌చెరు ప్రాంతంలో పెద్ద ఎత్తున చెరువులు, కుంటలు ఏర్పడ్డాయి. అమీన్‌పూర్ చెరువుతో పాటు గొలుసుకట్టు చెరువులు, కుంటలు ఏర్పడ్డాయి. అమీన్‌పూర్ చెరువు కింద కొత్త చెరువు, బొమ్మనకుట, శెట్టికుంట, శంభుని కుంట, ఉబకుంట, శంబి చెరువు, గండికుంట, పోచమ్మకుంటలు ఉన్నాయి. ఇలా అమీన్‌పూర్ పెద్ద చెరువుతో పాటు 12 కుంటలు కుతుబ్‌షాహీల కాలంలో పురుడుపోసుకున్నాయి. వాటిపై కబ్జాగాళ్ల కన్నుపడటంతో ఇప్పుడవి కనుమరుగయ్యాయి.
ల్యాండ్ మాఫియా చెరువులను కబ్జా చేసిన తర్వాత ఆ ప్రాంతంలో కుప్పలు తెప్పలుగా అక్రమ వెంచర్లు పుట్టుకొచ్చాయి. కాలక్రమేణ అవి ఇండ్లుగా, ఆ తర్వాత ఏకంగా కాలనీలుగా మారిపోయాయి. ప్రభుత్వ భూములను సైతం విడిచిపెట్టకుండా అక్రమ వెంచర్ల నిర్మాణాలను ఎంతో దర్జాగా కొనసాగిస్తున్నారు. శెట్టికుంట చెరువు స్థానంలో ఎటుచూసిన బిల్డింగ్‌లే కనిపిస్తున్నాయి. ఈ విషయంలో అధికారుల నిర్వాకం కొట్టొచ్చిన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
కొంతమంది అమీన్‌పూర్ చెరువు పరిధిలోని అక్రమాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. ఈ అక్రమ నిర్మాణాలపై NGT సీరియస్ అయింది. దీంతో చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామని ఎన్జీటీకి నివేదించింది రాష్ట్ర ప్రభుత్వం. అక్రమంగా వెలసిన 881 నిర్మాణాలలో 581 నిర్మాణాలకు నోటీసులు ఇచ్చామన్న ప్రభుత్వం… మిగితా వాటికి త్వరలోనే నోటీసులు ఇచ్చి కూల్చేస్తామని నివేదిక ఇచ్చింది. పటాన్‌చెరు నడిబొడ్డున అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న ఈ అమీన్ పూర్ చెరువుల పరిధిలోని కబ్జా బాగోతాలపై 10tv కథనం.
గజం భూమి కనిపిస్తే చాలు కబ్జారాయుళ్లు మాయం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలోని పెద్ద చెరువులో ఇదే జరిగింది. సుమారు 512 ఎకరాలు ఉన్న పెద్ద చెరువును ల్యాండ్ మాఫియా సగం వరకు కబ్జా చేసేసింది. చెరువు గర్బంలోకి వచ్చి నిర్మాణాలు చేపట్టారు. అధికారుల నామమాత్రపు చర్యలతో ఆక్రమణలు కొనసాగుతున్నాయి. గతంలో పెద్ద చెరువు ఎలా ఉండేది..? ఇప్పుడు ఎలా ఉంది..? కబ్జా రాయుళ్లు చెరువు ఎంత వరకు కబ్జా చేశారు ?
అమీన్‌పూర్ చెరువు కింద ఉన్నటువంటి కొత్త చెరువు కూడా కబ్జా చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కొత్త చెరువు స్థలంలో బోర్డులు పెట్టేశారు. కొత్త చెరువు తనదే అంటూ కాటసాని రాంభూపాల్‌రెడ్డి పేరుతో కొత్త చెరువులో బోర్డులు వెలిశాయి. అక్కడ కూడా ఎఫ్‌టీఎఫ్ పరిధి దాటి నిర్మాణాలు జరిగాయని కనిపిస్తోంది. పటాన్ చెరు నడిబొడ్డున అత్యంత ఖరీదైన ప్రదేశంలో సుమారు 100 ఎకరాల్లో ఉండే బొమ్మనుకుంట చెరువును ల్యాండ్ మాఫియా మింగేసింది. వెంచర్లు వేసి అమ్మకాలు చేయడంతో వందలాది ఇళ్లు నిర్మాణం అయ్యాయి. పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లు వెలిశాయి. బొమ్మనుకుంట చెరువుతో ల్యాండ్ మాఫియా పాగా వేయడంతో… పూర్తిగా కబ్జాకు గురైంది.
బొమ్మను కుంట చెరువు :- చెరువు కాలనీగా మారింది. ఎంటీ నమ్మడం లేదా..? అవును మీరు విన్నది నిజమే పటాన్‌చెరు అమీన్‌పూర్ చెరువు పరిధిలోని శెట్టికుంట, ఉభకుంటలో ఇళ్లు నిర్మాణం అయ్యాయి. చెరువు జాడలు కనుమరుగయ్యాయి. అక్రమ భూకబ్జా ముఠాల దాటికి చెరువుల జాడ లేకుండా పోయింది. మరింత సమాచారం తెలుసుకోవడానికి వీడియో చూడండి.