మేల్కొన్న RTC : బస్సులకు స్టీరింగ్ లాకింగ్

బస్సు చోరీతో RTC అధికారులు మేల్కొన్నారు. బస్సులు దొంగతనం కాకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానిపై చర్చలు జరిపి ఫైనల్‌గా ఓ నిర్ణయానికి వచ్చారు. అన్ని ఆర్టీసీ బస్సులకు స్టీరింగ్ లాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. తొలుత నగరంలో సిటీ బస్సులకు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మూడు రకాల డిజైన్లను చూసిన అధికారులు ఏప్రిల్ 27వ తేదీ శనివారం ఒక దానిని ఎంపిక చేసి ఆదేశాలు ఇవ్వనున్నారు.
కుషాయిగూడకు చెందిన ఆర్టీసీ బస్సును దొంగలు చోరీ చేసిన సంగతి తెలిసిందే. ఈ బస్సు మహారాష్ట్ర నాందేడ్ జిల్లా కంకిడిలో దొరికింది. బస్సు ఆనవాళ్లు లేకుండా దుండగులు పార్టులన్నింటినీ విడగొట్టి ముక్కలుగా చేశారు. సాధారణంగా వాహనాలకు లాక్ సిస్టం ఉంటుంది. లాక్ పడిన తర్వాత ఇంజిన్ ఆన్ చేయడం సాధ్యం కాదు. బస్సుల్లో మాత్రం ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ సిస్టం లేదు.
భవిష్యత్‌లో చోరీకి గురికాకుండా ఉండాలంటే ఖచ్చితంగా లాకింగ్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం మూడు రకాల డిజైన్లను చూశారు. అందులో ఒకదానిని ఎంపిక చేసి ఏప్రిల్ 27వ తేదీ శనివారం ఆర్టీసీ హైదరాబాద్ జోన్ ఈడీ వినోద్ కుమార్ ఆదేశాలు జారీ చేయనున్నారు. నైట్ హాల్ట్ చేసే బస్సుల వద్ద భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.