టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితాపై ఉత్కంఠ : ఆరుగురికి గ్రీన్ సిగ్నల్
టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే ఆరుగురు ఎంపీ అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే ఆరుగురు ఎంపీ అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
హైదరాబాద్ : టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా ఉత్కంఠ రేపుతోంది. మార్చి 21 గురువారం టీఆర్ఎస్ అధ్యక్షు, సీఎం కేసీఆర్ జాబితాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఆరుగురు ఎంపీ అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మరో 8 మంది అభ్యర్థులు ఎవరన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సిట్టింగ్ ఎంపీల్లో మార్పులు ఉంటాయన్న ప్రచారంతో ఎంపీ స్థానాలు ఎవరికి దక్కుతాయన్న సస్పెన్స్ అందరిలోనూ కనిపిస్తోంది.
అధికార పార్టీ ఎంపీ అభ్యర్థుల జాబితాపై ఉత్కంఠకు తెరపడనుంది. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్… ఎంపీ అభ్యర్థుల ఎంపికలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు పార్టీ అధికారికంగా ఎంపీ అభ్యర్థులను ఖరారు చేయకపోయినా కొన్ని స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలకు సమాచారం ఇచ్చింది. నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాలని సూచించడంతో ఆ అభ్యర్థులు ప్రచార పర్వంలో కూడా దిగారు.
ఆదిలాబాద్ నుంచి జి.నగేశ్, కరీంగనర్ స్థానానికి బోయినిపల్లి వినోద్ కుమార్, నిజామాబాద్ స్థానానికి కల్వకుంట్ల కవిత, భువనగరి నుంచి బూర నర్సయ్య గౌడ్, మెదక్ స్థానానికి కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్‌కు బి.బి. పాటిల్‌కు కేసీఆర్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరో పది పార్లమెంట్ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎంపీలందరికీ టికెట్లు ఖచ్చితంగా దక్కుతాయన్న నమ్మకం అధికార పార్టీ నేతల్లో లేవు. సిట్టింగ్ ఎంపీల్లో మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్న జితేందర్ రెడ్డి స్థానంలో పారిశ్రామిక వేత్త శ్రీనివాస్ రెడ్డిని రంగంలోకి దించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. పాలమూరు జిల్లాలో మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీ అభ్యర్థిగా రంగంలో దిగనుండడంతో అధికార పార్టీకి కూడా అందుకు ధీటుగా అభ్యర్థిని రంగంలోకి దించనుంది. ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పోటీ చేసే అవకాశం లేదన్న ప్రచారంతో మాజీ ఎంపీ నామా నాగేశ్వర్ రావు కు పార్టీ ఛాన్స్ ఇస్తుందని అంటున్నారు. మరో వ్యాపార వేత్త వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్‌కు ఇప్పటికే పార్టీ హామీ ఇచ్చిందనే వాదన వినిపిస్తోంది. మహబూబాబాద్ ఎంపీగా ఉన్న సీతారాం నాయక్ స్థానంలో బానోతు కవితను రంగంలోకి దింపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ నేతలు అంటున్నారు.
సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, నాగర్ కర్నూల్, పెద్దపల్లి స్థానాలకు కొత్తగా అభ్యర్థులను దింపాల్సి ఉంది. సికింద్రాబాద్ లో బీసీ సామాజికి వర్గానికి చెందిన నేతను రంగంలోకి దించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. మంత్రి తలసాని తనయుడు సాయికిరణ్, బొంతు శ్రీదేవి, దండే విఠల్ లలో ఎవరికి టికెట్ దక్కుతందో అని ఆసక్తి రేపుతోంది. మల్కాజిగిరి విషయంలో పార్టీ నవీన్ రావు అభ్యర్థిత్వాన్ని దాదాపు ఖరారు చేసినా… రేవంత్ ఆ స్థానం నుంచి పోటీ చేస్తుండడంతో… అదే సామాజికి వర్గానికి చెందిన నేతను బరిలో దింపే ఛాన్స్ ఉందని అంటున్నారు. చేవెళ్ల స్థానంలో పోటీ చేసేందుకు వ్యాపారవేత్త రంజిత్ రెడ్డి పేరు ఖరారైందని పార్టీ వర్గాలు అంటున్నాయి. నాగర్ కర్నూల్‌లో మాజీ మంత్రి రాములుకు ఛాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లి టికెట్‌ను జి వివేక్ ఆశిస్తున్నా…… మరో ఇద్దరు నేతల పేర్లు ఆ స్థానం కోసం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
నల్లగొండలో ఉత‌్తమ్ కుమార్ రెడ్డికి పోటీగా గుత్తా సుఖేందర్ రెడ్డిని రంగంలోకి దించాలని గులాబీ బాస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వరంగల్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న పసునూరి దయాకర్ విషయంలో ఎమ్మెల్యేలు సానుకూలంగా ఉన్నా జాతీయ రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కడియం శ్రీహరికి ఆ స్థానం కట్టబెట్టే అవకాశం ఉందన్న ప్రచారం గులాబీ పార్టీలో జోరుగా సాగుతోంది. హైదరాబాద్‌లో నామమాత్రంగా అభ్యర్థిని రంగంలోకి దించే అవకాశాలున్నాయి