గీత దాటొద్దు : అసెంబ్లీ సెషన్స్‌లో మీడియాకు లక్ష్మణరేఖ

హైదరాబాద్ : మీడియా ప్రతినిధులు ఇకమీదట అసెంబ్లీలో ఇష్టమొచ్చినట్టు తిరగడానికి అవకాశంలేదు. లాబీ పాస్‌లుంటే లాబీల్లోనే ఉండాలి. మీడియా పాయింట్ పాస్‌లుంటే మీడియా పాయింట్ దగ్గరే ఉండాలి. గతంలో లాగా మంత్రులు, ఎమ్మెల్యేలతో చిట్‌చాట్ చేయడం ఇకపై కుదరదు. ఈనెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మీడియా కవరేజీకి కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఈనెల 17 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మీడియా ప్రతినిధులకు కొత్త మార్గదర్శకాలు జారీచేస్తూ శానససభ కార్యదర్శి నర్సింహాచార్యలు నోటిఫికేషన్ జారీ చేశారు. జర్నలిస్ట్‌ల వార్తల కవరేజ్‌కి లక్ష్మణరేఖను నిర్దేశించించారు. మీడియా గ్యాలరీ, లాబీల్లో ప్రవేశంపై పరిమితులు విధించారు.
కార్డు స్వైప్ చేసిన తర్వాతే లోపలికి అనుమతి
గ్యాలరీలో జర్నలిస్ట్‌లు నిల్చోడానికి వీల్లేదు
మీడియా గ్యాలరీ నిండిపోతే సందర్శకుల గ్యాలరీలోకి అనుమతి గ్యాలరీలోకి కెమెరాలు, ఫోన్లు తీసుకెళ్లకుండా ఆంక్షలు
ఇన్నర్ లాబీల్లో ప్రవేశం పూర్తిగా నిషిద్ధం
ఫోటోలు తీయకుండా ఆంక్షలు
అసెంబ్లీ లోపల మీడియాకి అనుమతిలేదు
సీఎం, స్పీకర్, మంత్రుల చాంబర్ల వద్దకు వెళ్లకుండా ఆంక్షలు
గ్యాలరీలోకైనా, లాబీల్లోకైనా అసెంబ్లీ కార్యదర్శి జారీ చేసిన గుర్తింపు కార్డును స్వైప్ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు. గ్యాలరీలో జర్నలిస్ట్‌లు నిల్చోడానికి, మాట్లాడుకోడానికి వీల్లేదు. మీడియా గ్యాలరీ నిండిపోతే.. జర్నలిస్ట్‌లను సందర్శకుల గ్యాలరీలోకి అనుమతిస్తారు. గ్యాలరీలోకి కెమెరాలు, ఫోన్లను అనుమతించారు. ఇన్నర్ లాబీల్లో ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. ఫోటోలు తీయకుండా ఆంక్షలు విధించారు. అసెంబ్లీ లోపలికి మీడియా ప్రతినిధులెవరినీ అనుమతించారు. ముఖ్యమంత్రి, స్పీకర్, మంత్రుల చాంబర్ల వద్దకు వెళ్లడానికి వీలులేదు.
కారిడార్లలో కూడా మంత్రులను కలిసే అవకాశంలేకుండా చేశారు. లాబీ పాస్‌లున్న జర్నలిస్ట్‌లు లాబీ వరకే పరిమితం కావాలి. మీడియా పాయింట్ పాస్‌లున్న జర్నలిస్ట్‌లు… మీడియా పాయింట్ వద్ద కవరేజ్‌కి మాత్రమే అనుమతిస్తారు. మీడియా పాయింట్ వద్ద మినహా… అసెంబ్లీలో ఎక్కడా ఇంటర్వ్యూలు చేసేందుకు అనుమతించరు. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేల ఇంటర్వ్యూలు, బైట్లను అసెంబ్లీ అవరణలో తీసుకోకుండా ఉత్తర్వులు జారీ అయ్యాయి. మీడియా వాహనాలను పబ్లిక్ గార్డెన్‌లోనే పార్క్ చేయాల్సి ఉంటుంది. టీవీ చానల్స్ ఓబీ వ్యాన్లు, డీఎస్‌ఎన్‌జీ వ్యాన్లకు ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన పార్కింగ్‌కు అవకాశం కల్పిస్తారు. మీడియా ప్రతినిధుల మార్గదర్శకాలు కచ్చితంగా పాటించే విధంగా చూడాలని అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు.. పోలీసులకు సూచించారు.