తెలంగాణ కాబినెట్ భేటీ

ప్రగతి భవన్‌లో ఇవాళ్ల (అక్టోబర్ 1, 2019)న తెలంగాణ కాబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు జరగబోయే కాబినెట్ భేటీలో మూడు ప్రధానమైన అంశాలపై చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. కొత్త రెవెన్యూ చట్టం, సచివాలయం కూల్చివేత, ఆర్టీసీ సమ్మె చట్టం వంటి విషయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేదానిపై ఉద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది.
ఈ మూడు ప్రధానమైన అంశాలపై చర్చ జరపనుంది. కొత్త రెవెన్యూ చట్టం కచ్చితంగా తీసుకొస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల ముగిసిన సమావేశాల్లో స్పష్టం చేశారు. ఈ బిల్లుకు సంబంధించిన ముసాయిదాకు కాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సై అంటున్న తరుణంలో ప్రభుత్వం ఈ అంశంపై కీలకమైన నిర్ణయం తీసుకుంటుందా ? అనేది ఉత్కంఠగా మారింది.
ఇక తమ డిమాండ్ల నెరవేర్చకపోతే ఈ నెల (అక్టోబర్ 5, 2019) నుంచి సమ్మె చేస్తామని తెలంగాణ ఆర్టీసీ యూనియన్లు ఇప్పటికే ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. దీంతో సమ్మె నివారణకు తీసుకొవాల్సిన చర్యలపై తెలంగాణ కాబినెట్ చర్చించే అవకాశం ఉందని సమాచారం. ఇక కొత్త సచివాలయం నిర్మాణం పాత సచివాలయం కూల్చివేత అంశంపై కూడా కేబినెట్‌లో చర్చ జరగనుంది. ఇప్పటికే సచివాలయం తరలింపు పూర్తవడంతో భవనాల కూల్చివేతపై కాబినెట్‌లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది.