ఎవరా 8మంది : 18న మంత్రివర్గ విస్తరణ

హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. 2019, జనవరి 18వ తేదీ శుక్రవారం మంత్రివర్గ విస్తరణ జరగనుంది. 8మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. కేబినెట్ విస్తరణకు ఏర్పాట్లు చేయాలని జీఏడీ, ప్రొటోకాల్ శాఖలకు సీఎంవో సర్క్మూలర్ జారీ చేసింది. సంక్రాంతి తర్వాత అసెంబ్లీ సమావేశాలు, మంత్రివర్గ విస్తరణ జరగనున్నాయి. 2019, జనవరి 17వ తేదీ గురువారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం జరుగుతుంది. 18న స్పీకర్ ఎంపిక, అదే రోజు మంత్రివర్గ విస్తరణ కూడా జరగనుంది.
గత మంత్రివర్గంలో ఉన్నవారిలో నలుగురికి ఈసారి కూడా మినిస్టర్ పదవి ఛాన్స్ దక్కనుంది. గత కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి, ఈటెల రాజేందర్, హరీష్ రావు, కేటీఆర్‌లకు ఈసారి కూడా పదవులు దక్కుతాయని సమాచారం. కొత్త వారిలో మహిళా మంత్రిగా పద్మా దేవేందర్‌రెడ్డికి కచ్చితంగా అవకాశం ఇస్తారని తెలుస్తోంది. గత కేబినెట్‌లో ఒక్క మహిళ కూడా లేదు. దీంతో ఈసారి మహిళకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఈసారి కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన వారికి మంత్రి పదవులు దక్కనున్నాయని సమాచారం. నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్ రెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కేసీఆర్, మహమూద్ అలీ మంత్రులుగా ఉన్నారు. మరో 8మంది అమాత్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎవరెవరికి మంత్రి పదవులు దక్కనున్నాయనేది ఆసక్తికరంగా మారింది.