కేసీఆర్ ఢిల్లీ టూర్ : షాతో ముగిసిన సమావేశం

  • Published By: madhu ,Published On : October 4, 2019 / 09:14 AM IST
కేసీఆర్ ఢిల్లీ టూర్ : షాతో ముగిసిన సమావేశం

Updated On : October 4, 2019 / 9:14 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ కొనసాగుతోంది. కేంద్ర పెద్దలతో వరుస భేటీ జరుపుతూ బిజీ బిజీగా గడుపుతున్నారు. అక్టోబర్ 04వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో..సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశం సుమారు 40 నిమిషాల పాటు జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు రాజకీయాల అంశాలు కూడా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు షాకు వివరించారు సీఎం కేసీఆర్. కేంద్రం సహకరించాలని..తద్వారా రాష్ట్రం ఇంకా అభివృద్ధి పథంలో దూసుకెళుతుందని చెప్పారు. 

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టడమే లక్ష్యంగా హస్తిన బాట పట్టిన కేసీఆర్‌.. ఈ సమావేశంలో… రాష్ట్రానికి ఆర్ధిక సహకారం, గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంతోపాటు విభజన అంశాలపై చర్చించనున్నారు. షాతో జరిగిన భేటీలో…కొత్తగా ఏర్పాటు చేసిన ములుగు, నారాయణపేట్ జిల్లాలను జోనల్ వ్యవస్థలో నోటిఫై చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. విభజన చట్టం అమలు, ఇంకా పెండింగ్ లో ఉన్న అంశాలను ఆయన దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. 

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు సఖ్యతగా ఉన్నట్లు…ఈ క్రమంలో సమస్యల పరిష్కారానికి కేంద్రం చొరవ చూపాలన్నారు. ఆస్తులు, అప్పులు, పంపకాలు, షెడ్యూల్ 9, 10లో ఉన్న అంశాలు, రెండు రాష్టాల మధ్య పెండింగ్ లో నీటి పంపకాలు..తదితర విషయాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సంబంధించిన విషయాలను షా దగ్గర ప్రస్తావించినట్లు సమాచారం.

సాయంత్రం 4.30 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సీఎం కేసీఆర్ భేటీ అవుతారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు నీతి ఆయోగ్ ప్రతిపాదించిన రూ.19వేల కోట్ల సాయాన్ని మంజూరు చేయాలని కూడా ప్రధానిని కోరనున్నారు కేసీఆర్. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని, కేంద్ర పథకాలకు ఇవ్వాల్సిన నిధులను విడుదల చేయాలని ఈ సమావేశంలో ప్రధానిని కోరనున్నారు సీఎం కేసీఆర్.
Read More : బినామీ ఆస్తులు లేవు : తప్పు చేస్తే అరెస్టుకు సిద్ధం – మధుసూధన్ రెడ్డి