హైదరాబాద్ మీద కేసీఆర్ స్పెషల్ ఫోకస్…. కరోనా కట్టడికి కంటైన్మెంట్ జోన్ల వ్యూహం  

  • Published By: chvmurthy ,Published On : April 13, 2020 / 01:32 PM IST
హైదరాబాద్ మీద కేసీఆర్ స్పెషల్ ఫోకస్…. కరోనా కట్టడికి కంటైన్మెంట్ జోన్ల వ్యూహం  

Updated On : April 13, 2020 / 1:32 PM IST

హైదరాబాద్‌లో కరోనా కట్డడికి తానే పూర్తిస్థాయి పర్యవేక్షణలోకి దిగారు సీఎం కేసీఆర్. కరోనా వ్యాప్తిని ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి పకడ్బందీ వ్యూహాన్ని సిద్ధం చేశారు. రాష్ట్రంలోనే ఎక్కువ పాజిటీవ్ కేసులు గ్రేటర్ హైదరాబాద్‌లోనే నమోదయ్యాయి. తొలివిడత లాక్‌డౌన్  ఏప్రిల్14, మంగళవారంతో ముగుస్తుంది. మరో రెండువారాలు లాక్‌డౌన్ కొనసాగుతుందని కేసీఆర్ చెప్పారు. ఈనెలాఖరులోగా కరోనాను ఖతం చేయడానికి సీఎం పట్టుదలగా ఉన్నారు.
 
గ్రేటర్ హైదరాబాద్‌లో రాకపోకలను పూర్తిగా నిషేధించారు. కిలోమీటర్ పరిధిలోనే రాకపోకలు ఉండేలా అనుమతిస్తున్నారు. అందులో 125 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ఇక గడపదాటడానికి వీల్లేదు. ఈ ఏరియాల్లో పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

నిషేధాజ్ఞలు అమలు చేస్తున్న ప్రాంతాల నుంచి ప్రజలెవరూ బయటకు రాకూడదు. నిత్యావసరాలను కూడా మొబైల్ వాహనాల ద్వారా సరఫరా చేస్తున్నారు. ప్రత్యేకంగా జీహెచ్ఎంసీకి చెందిన ఒక నోడల్ ఆఫీసర్ ను నియమించి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
 

గ్రేటర్‌ పరిధిలో మలక్ పేట, సంతో‌ష్ నగర్, చాంద్రాయణగుట్ట, చార్మినార్, ఫలక్‌నామా, గోషామహల్, ముషీరాబాద్, అంబర్‌పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, యూసఫ్‌గూడ, సికింద్రాబాద్, బేగంపేట్, కాప్రా, ఉప్పల్, సరూర్ నగర్,  రాజేంద్రనగర్, శాస్త్రిపురం, శేరిలింగంపల్లి సర్కిళ్లలోని కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను గుర్తించి, ఆ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రాంతాలన్నీ పూర్తిగా దిగ్బంధంలోనే ఉన్నాయి.