ప్రచారానికి KCR బ్రేక్ : వ్యూహాలపై కసరత్తు

పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి కేసిఆర్ రెండు రోజులు విరామం ఇచ్చారు. అనంతరం రెండు సభల్లో పాల్గొనే విధంగా షెడ్యూల్ ను పార్టీ విడుదల చేసింది. తొలి విడత ప్రచారంలో భాగంగా 13 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని పూర్తి చేశారు. ఉగాది పండుగను పురస్కరించుకుని రెండు రోజుల పాటు ప్రచార పర్వానికి బ్రేక్ వేసినా పార్లమెంట్ ఎన్నికల వ్యూహాలపై కసరత్తు మాత్రం చేస్తున్నారు.
తెలంగాణాలో ఉన్న పార్లమెంట్ స్థానాలను మిత్ర పక్షాలతో కలిసి కైవసం చేసుకోవాలని గులాబి దళపతి కేసిఆర్ భావిస్తున్నారు. తొలి విడత ప్రచారాన్ని పూర్తి చేసుకున్నారు. 13 పార్లమెంట్ సెగ్మెంట్‌లలో ఎన్నికల ప్రచార సభల్లో సీఎం పాల్గొన్నారు. మార్చి 29వ తేదీన మొదలైన సభలతో కేసిఆర్ పార్టీ తొలి విడత ప్రచారాన్ని ముగించారు. రెండు రోజుల విరామం అనంతరం ఆది, సోమ వారాల్లో నిర్మల్, వికారాబాద్ జిల్లాల్లో జరిగే ప్రచార సభల్లో కేసిఆర్ పాల్గొననున్నారు.
ఇప్పటి వరకు ప్రచారం జరిగిన నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని ఆరా తీస్తూనే మరో వైపు బలమైన నేతలను పార్లమెంట్ ఎన్నికలకు ముందుగానే కారెక్కించుకునే పనిలో గులాబి నేతలు బిజీగా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు,మాజీ ఎమ్మెల్యేలు విపక్ష పార్టీల నేతలు కారెక్కేందుకు ఆసక్తి చూపుతుండడంతో వారందరినీ పార్టీలో చేర్చుకుని క్షేత్ర స్థాయిలో మరింత బలంగా మారేందుకు అధికార పార్టీ పావులు కదుపుతోంది.
సీనియర్ నేతలయితే ముఖ్యమంత్రి కేసిఆర్ స్వయంగా చర్చలు జరుపుతున్నారు. ఏప్రిల్ 05వ తేదీ శుక్రవారం నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నేత మండవ వెంకటేశ్వర్ రావు ఇంటికి వెళ్లి కేసిఆర్…ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఇక మండవ చేరిక లాంఛనమే అధికార పార్టీ నేతలు అంటున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మండవను పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే మండవ కారెక్కుతారని ప్రచారం జరిగినా…అప్పట్లో అది సాధ్యం కాలేదు. కాని పార్లమెంట్ ఎన్నికలకు ముందు కారెక్కడం ఖాయమైంది. మండవ అనుచరలుగా జిల్లాలో గుర్తింపు పొందిన నేతలంతా ఇప్పటికే గులాబి తీర్థం పుచ్చుకున్నారు. మరో వైపు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆధ్వర్యంలోనూ మాజీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున అధికార పార్టీ పార్టీ గూటికి చేరుకుంటున్నారు. 2,3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పరిస్థితి అంతసునాయసంగా లేదన్న సమాచారం అందడంతో ఆయా పార్లమెంట్ పరిధిలోని నేతలతో పాటు ఇంచార్జ్ లు గా వ్యవహరిస్తున్న మంత్రులకు పలు సూచనలను సీఎం కేసిఆర్ చేసినట్లు సమాచారం.