అభియోగం ఉంటే అనర్హులే.. కేసు ఉంటే ఉద్యోగం రాదు: హైకోర్టు

క్రిమినల్ కేసుల్లో నిర్ధోషులుగా బయటపడినా కూడా వారిని పోలీస్ కానిస్టేబుళ్ల పోస్టులకు ఎంపిక చేయకూడదంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది. నేరం అభియోగం కూడా మచ్చ వంటిదేనని న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు తీర్పు చెప్పారు. నారాయణ్‌ఖేడ్ మండలం రాయకల్లుకు చెందిన కృష్ణకుమార్ అనే ఎస్టీ యువకుడు 2015 డిసెంబర్‌లో వెల్లడైన నోటిఫికేషన్ తర్వాత జరిగిన అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. అతని పేరును కానిస్టేబుల్ ఎంపిక లిస్ట్‌లో పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు పెట్టింది.
అయితే అతనిపై క్రిమినల్ కేసు ఉండడంతో ఎంపికను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్టు. దీంతో తనపై నమోదైన కేసులో నిర్ధోషిగా బయటకు వచ్చానంటూ సదరు యువకుడు కోర్టు మెట్లెక్కాడు. కానిస్టేబుల్ సెలక్షన్ అయ్యేలా హోంశాఖకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు కూడా అతనికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది.
రిట్‌ను విచారించిన హైకోర్టు క్రిమినల్ ఆరోపణలు కోర్టులో నిలవకపోయినా కానిస్టేబుల్ పోస్టులకు ఎంపిక చేయకపోవడం లేదా ఎంపికైన వాళ్లను రద్దు చేయడం చట్టబద్ధమేనంటూ వివరించింది. ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పులను కూడా ఉదాహరణగా చూపెట్టింది కోెర్టు.