10tv క్షేత్రస్థాయి పరిశీలన : బస్సు చోరీ అయినా మారని RTC

  • Published By: madhu ,Published On : April 28, 2019 / 01:57 AM IST
10tv క్షేత్రస్థాయి పరిశీలన : బస్సు చోరీ అయినా మారని RTC

Updated On : April 28, 2019 / 1:57 AM IST

ఇంట్లో చిన్న వస్తువు పోతేనే.. మళ్లీ అలాంటిది జరగకుండా జాగ్రత్త పడతాం. పర్సులో 100 రూపాయలు చోరీకి గురైతే… మరుసటి రోజు నుంచి ఒకటికి పదిసార్లు చెక్‌ చేసుకుంటాం. మరి.. లక్షల రూపాయల బస్సును దొంగలు ఎత్తుకపోయిన తర్వాత ఏం చేయాలి? సర్కార్ సొమ్మేగా.. మాకేంటని ఊరుకోవాలా? మళ్లీ అలాంటి ఘటనలు జరగకుండా భద్రత పెంచాలా? మన RTC అధికారులు ఏం చేస్తున్నారో తెలుసా? బస్సు దొంగతనం తర్వాత కూడా ఆర్టీసీ ఉన్నతాధికారుల్లో ఎలాంటి మార్పు రాలేదు. అదే నిర్లక్ష్యం.. అదే అలసత్వం. 10tv ప్రతినిధి పరిశీలనలో ఈ దృశ్యాలు కళ్లకు కట్టినట్లు కనిపించాయి. ఆర్టీసీ బస్సు చోరీకి బాధ్యుడ్ని చేస్తూ డ్రైవర్‌పై చర్యలకు ఉపక్రమించారు ఉన్నతాధికారులు. అలాగే ఈ ఘటనపై తూతూమంత్రంగా ఓ విచారణ కమిటీని నియమించారు. కానీ.. అసలు సంగతి మాత్రం మర్చిపోయారు. సీబీఎస్‌ భద్రతపై దృష్టి పెట్టడం మర్చిపోతున్నారు. బస్సుల బాధ్యతను గాలికొదిలేస్తున్నారు.

గతంలో సీబీఎస్‌ హ్యాంగర్‌గా ఉన్నప్పుడు… నగరంలోని పలు డిపోల బస్సుల్ని… రాత్రి సమయంలో అక్కడే పార్క్‌ చేసి… తిరిగి ఉదయం తీసుకెళ్లేవారు. అప్పట్లో నిత్యం వందకుపైగా బస్సుల్ని నిలిపి ఉంచేవారు. దీంతో ఎప్పటికప్పుడు సీబీఎస్‌కు వచ్చిన బస్సుల వివరాలను… అక్కడి భద్రతా సిబ్బంది రిజిస్టర్‌లో నమోదు చేసుకునేవారు. కొన్నేళ్ల క్రితం హ్యాంగర్‌ కూలిపోవడంతో… అక్కడ గస్తీ కాసే సిబ్బంది సంఖ్య కూడా తగ్గిపోయింది.

ప్రస్తుతం ఐదుగురు హోంగార్డులు మాత్రమే విధుల్లో ఉన్నారు. ఇటీవల ఎన్నికల సందర్భంగా… వారిని కూడా ఇతర ప్రాంతాలకు పంపించారు. దీంతో సీబీఎస్‌కు అసలు రక్షణే లేకుండా పోయింది. ఆర్టీసీ బస్సుల భద్రత గాల్లో దీపంలా మారిపోయింది. గతంలో హోంగార్డులు గస్తీ కాసినప్పుడే… బస్సుల్లోని బ్యాటరీలు, ఇతర పరికరాలు చోరీకి గురైన ఘటనలున్నాయి. ఇప్పుడూ భద్రతా సిబ్బంది అసలే లేకపోవడంతో… బస్సులకు భద్రత కరువైంది.

మొత్తానికి లక్షల విలువైన బస్సు చోరీకి గురైనా… ఆర్టీసీ నిర్లక్ష్యంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చినా… అధికారులు మాత్రం నిద్రమత్తు వీడటం లేదు. వారి తీరులో ఎలాంటి మార్పు లేకపోవడంతో… సీబీఎస్‌కు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పక తప్పదు. సీబీఎస్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించిన 10టీవీ ప్రతినిధి… అక్కడి పరిస్థితులను… భద్రతా లోపాలను… కళ్లకు కట్టారు. అడుగడుగునా అధికారుల అలసత్వాన్ని ఎత్తి చూపించారు. మరి… ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యంలో మార్పు వస్తుందో, లేదో చూడాలి. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.