అంత సీనుందా : విజయశాంతికి ప్రచార బాధ్యతలపై సీనియర్లు గుస్సా

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచార సారథిగా భాధ్యతలు భూజానికి ఎత్తుకున్న విజయశాంతి కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేరుస్తారా? స్టార్ క్యాంపెయినర్‌గా అసెంబ్లీ ఎన్నికల్లో ఫెయిల్యూర్ స్టోరీని మూటకట్టుకున్న రాములమ్మ.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో సక్సెస్ కాగలదా..? ఇంతకు రాములమ్మ కొత్త కొలువుపై పార్టీలో సీనియర్స్ ఏమనుకుంటున్నారు.
లోక్‌సభ ఎన్నికలకు రెడీ అవుతున్న తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి కొత్త కుంపటి రాజేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న విజయశాంతికి ఇప్పుడు ప్రచార కమిటీ సారథిగా బాధ్యతలు అప్పగించడంపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. రాములమ్మ అసెంబ్లీ స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం చేసినా.. పార్టీ 19 స్థానాలకే పరిమితమైంది. ఆ ఫలితాలు చూసి కూడా విజయశాంతికి పార్లమెంట్ ఎన్నికల ప్రచార కమీటీ ఛైర్మన్‌గా ప్రమోషన్ ఇవ్వడాన్ని కొందరు సీనియర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్స్‌కు కొదవలేదు. రాజకీయంగా అపార అనుభవం ఉన్న హేమాహేమీలున్నప్పటికీ విజయశాంతికి ప్రచార కమిటీ భాధ్యతలు ఇవ్వడం ఏంటన్న చర్చ పార్టీలో జరుగుతోంది. బీజేపీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి తర్వాత తల్లి తెలంగాణ పార్టీ పెట్టి టీఆర్ఎస్‌లో విలీనం చేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ టికెట్‌పై ఎంపీగా గెలిచారు. 2014లో మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయారు. వ్యక్తిగతంగా పొలిటికల్ ట్రాక్ రికార్డ్ లేని రాములమ్మకు కీలక ప్రచార బాధ్యతలు ఎలా అప్పగిస్తారనేది కొందరు సీనియర్ల వాదన.
కేసీఆర్ లాంటి రాజకీయ ఉద్దండుని ఎదుర్కోవాలంటే ఆ స్థాయి నాయకుడికి ప్రచార బాధ్యతలు అప్పజెపితే ఆశించిన ఫలితాలు వస్తాయనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది. తెలంగాణ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన జానారెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలో ఎవరికో ఒకరికి ప్రచార భాధ్యతలు ఇస్తే బాగుండేదన్న వాదన వినిపిస్తుంది. వీరు కాకుండా మాస్ ఫాలోయింగ్ ఉన్న రేవంత్ రెడ్డికి ఇచ్చినా పార్టీలో జోష్ వచ్చేదంటున్నారు. ఒకవేళ మహిళకే ప్రాధాన్యత కల్పించాలని అధిష్ఠానం భావించి ఉంటే డీకే అరుణకు ప్రచార కమిటీ ఛైర్మన్ బాధ్యతలు ఇస్తే టీఆర్ఎస్‌కు గట్టిపోటీ ఇవ్వగలమనే అభిప్రాయం పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతోంది. ఇవేవి పట్టించుకోకుండా స్టార్ క్యాంపెయినర్‌గా ఫెయిల్యూరైన విజయశాంతికి మళ్లీ ప్రమోషన్ ఇవ్వడంపై సీనియర్లు రగిలిపోతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటకట్టుకున్న కాంగ్రెస్.. లోక్‌సభ ఎన్నికలపై గంపెడాశలు పెట్టుకుంది. ఇటువంటి సమయంలో రాములమ్మకు అప్పజెప్పిన పదవి పార్టీలో కుంపటిని రాజేసింది. విజయశాంతిని ప్రచార సారథిగా జీర్ణించుకోలేక పోతున్న నేతలు పార్టీతో అంటీముట్టనట్లు ఉండాలనే నిర్ణయానికొచ్చినట్లు కనిపిస్తున్నారు. మరి వీరిని ఢిల్లీ పెద్దలు ఎలా కూల్ చేస్తారో చూడాలి.