సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం : లాక్ డౌన్,పంట కొనుగోళ్లుపై సమీక్ష

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్ లో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న మంత్రులతోపాటు అత్యున్నత స్ధాయి అధికారులు హాజరు కానున్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ను మరింత పటిష్టంగా అమలు చేయటం, ప్రజల్లో అవగాహన పెంచే కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
వీటితో పాటు పంటల కొనుగోళ్లు అంశం కూడా చర్చించనున్నారు. అనంతరం సాయంత్రం 33 జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు, వైద్య,ఆరోగ్య వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కరోనా కట్టడిపై తీసుకుంటున్న చర్యలు, పంటకొనుగోళ్లు పై అధికారులతో చర్చిస్తారు.
రాష్ట్రంలో లాక్ డౌన్ అమలవుతున్నందు వల్ల మార్కెట్లన్ని మూసి ఉంచటంతో ప్రభుత్వం… గ్రామాల్లోనే పంటలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందు కోసం వీలైనన్ని ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అక్కడ కూడా గుంపులు గుంపులుగా కాకుండా సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
సీఎం ఆదేశాలకు అనుగుణంగా పంటల కొనుగోళ్ల కోసం … వీలైనన్ని ఎక్కువ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ధాన్యం సేకరణ కోసం గతంలో 4028 కేంద్రాలు ఉండగా ఈసారి ఏకంగా 6700 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదిస్తున్నారు. తెల్ల రేషన్ కార్డుదారులకు ఒక్కక్కరికి 12 కిలోల బియ్యం పంపిణీ అంశంపై కూడా సీఎం కేసీఆర్ సమీక్షించి అవసరమైన ఆదేశాలు జారీ చేయనున్నారు.