TSRTCలో సమ్మె సైరన్ : నోటీసు ఇచ్చిన TMU

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మకు TMU సమ్మె నోటీసు ఇచ్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే..సెప్టెంబర్ 25 తర్వాత సమ్మెలోకి వెళుతామని సెప్టెంబర్ 11వ తేదీ బుధవారం టీఎంయూ ప్రధాన కార్యదర్శి ప్రకటించారు. ఇటీవలే ఏపీ రాష్ట్రంలో ఆర్టీసీపై సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.
గత నాలుగేళ్లుగా అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని, వీటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా వేతన ఒప్పందంపై వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేతన ఒప్పందం 2017 మార్చితో ముగిసిందని, అదే ఏడాది ఏప్రిల్ నుంచి కొత్త పే స్కేల్ విధానం అమల్లోకి రావాల్సి ఉన్నా..అమల్లో చేయలేదని ఆరోపిస్తున్నారు. 2018లో సమ్మెలోకి వెళుతామని చెప్పడంతో ప్రభుత్వం 16 శాతం మధ్యంతర భృతిని అమలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే..పూర్తిస్థాయి వేతన ఒప్పందం, ఇతర అలెవెన్సులు, సమస్యల పరిష్కారంపై దృష్టి సారించలేదు. ప్రభుత్వ వైఖరిపై కార్మికులు మండిపడుతున్నారు. ఏడేళ్లుగా సిబ్బంది నియామకం లేకపోవడంతో అదనపు పని భారం పడుతోందని దీనివల్ల సమస్యలు ఎదుర్కొంటున్నామని కార్మికులు పేర్కొంటున్నారు. వెంటనే తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని లేనిపక్షంలో ఏ క్షణమైనా సమ్మెలోకి వెళుతామని హెచ్చరిస్తున్నాయి ప్రధాన సంఘాలు. సమ్మెను విరమింప చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.