కలిసి పోరాడుదాం : ఆర్టీసీ సమ్మె..ఎవరూ భయపడొద్దు – కార్మిక సంఘాలు

ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా సమ్మెకు వెనక్కు తగ్గేది లేదంటున్నాయి ఆర్టీసీ కార్మిక సంఘాలు. తమ డిమాండ్లపై ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. కార్మికులు ఎవరూ అధైర్యపడవద్దని సూచించింది. ఆర్టీసీ సమ్మెపై అక్టోబర్ 25వ తేదీ శుక్రవారం సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కార్మికుల్లో ఆందోళన రేగింది. దీంతో జేఏసీ నేతలు రంగంలోకి దిగి ఎవరూ భయపడొద్దని ధైర్యం చెప్పారు.
శుక్రవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించిన జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అక్కడి కార్మికులతో సమావేశం నిర్వహించి ఆందోళన విరమించుకోవద్దని కోరారు. సీఎం కేసీఆర్ ఆర్టీసీపై అసత్య ప్రచారం చేస్తున్నారని జేఏసీ నేతలు విమర్శించారు. వాస్తవాలు దాచిపెడుతున్నారని మండిపడ్డారు. సీఎం చిత్తశుద్ధితో సమ్మె విరమణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
మరోవైపు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన రాస్తారోకోలను తాత్కాలింగా వాయిదా వేసింది ఆర్టీసీ జేఏసీ. దాని బదులు ఆయా ప్రాంతాల్లో ఉన్న విద్యాసంస్థలకు వెళ్లి సమ్మెకు దారి తీసిన పరిస్థితులను విద్యార్థులకు వివరించి వారి మద్దతు కూడగట్టుకోవాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో ఉన్న జేఏసీ నేతలు హుటాహుటిన అత్యవసర సమావేశం నిర్వహించారు. కార్మికులకు సూచనలు చేశారు.
కార్మికుల రక్షణకు హైకోర్టు జోక్యం చేసుకుంటుందని, అన్యాయం జరిగే ప్రసక్తే లేదని ధైర్యం చెప్పారు. సీఎం వ్యాఖ్యలపై జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ వచ్చాక ఆర్టీసీకి రూ.4,250 కోట్లు ఇచ్చినట్టు చెప్పిన మాటల్లో నిజం లేదని, కేవలం రూ.712 కోట్లు మాత్రమే ఇచ్చారని స్పష్టం చేశారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో ఆర్టీసీ సమ్మె నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. సమ్మె కార్యాచరణను మరింత ఉధృతం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయించింది.
Read More : గులాబీ గుబాళింపు : హూజూర్ నగర్‌కు రానున్న సీఎం కేసీఆర్