వెదర్ అప్ డేట్ : రెండు రోజులు భారీ వర్షాలు

  • Published By: chvmurthy ,Published On : October 30, 2019 / 02:52 AM IST
వెదర్ అప్ డేట్ : రెండు రోజులు భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో బుధ, గురువారాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడా ఉరుములు మెరుపులతో  తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

కోమోరిన్, దాని పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కోనసాగుతోందని అధికారులు వివరించారు.  ఇది రాగల 24 గంటల్లో లక్షదీవులు, మాల్దీవులు ఆనుకుని ఉన్న అరేబియా సముద్రం ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశముందని హెచ్చరించారు. అల్పపీడనాలకు తోడు ఉపరితల ఆవర్తనం తోడవడంతో దక్షిణ భారతంలోని చాలా ప్రాంతాలలో తేలికపాటి నుండి అధిక వర్షపాతం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. 

ఏపీ, తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, దక్షిణ కర్ణాటక, కేరళ, లక్షద్వీప్ ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు.  కేరళ, మాల్దీవులు, మన్నూ ప్రాంతాల్లోని అరేబియా సముద్ర తీర ప్రాంతాల్లో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడన ప్రభావం వల్ల సముద్రం అల్లకల్లోలంగా మారినందున మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లరాదని వాతావరణకేంద్రం అధికారులు కోరారు. మరో వైపు ఏపీలోని ప్రకాశం జిల్లాలో  భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఒంగోలులో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.