ఇండోనేషియాలో కొండచరియలు విరిగిపడి 11 మంది దుర్మరణం

11 people killed in Indonesia landslide, 18 injured : ఇండోనేషియాలో కొండచరియలు విరిగి పడి 11 మంది మృతి చెందారు. ఇండోనేషియా పశ్చిమ జావాలోని సుమెడాంగ్ రీజెన్సీలో శనివారం రాత్రి కొండచరియలు విరిగిపడడంతో 11 మంది మరణించగా, మరో 18 మందికి గాయాలయ్యాయని ఇండోనేషియా అధికారులు పేర్కొన్నారు. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడ్డాయని నేషనల్ ఏజెన్సీ ఫర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారి తెలిపారు.
తొలుత కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టి, బాధితులను ఖాళీ చేస్తున్న సమయంలో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయని పేర్కొన్నారు. మృతుల్లో సెర్చ్ అండ్ రెస్క్యూ వర్కర్లు కూడా ఉన్నారని తెలిపారు. సైనికులు, పోలీసులు, స్థానిక విపత్తు నిర్వహణ ఏజెన్సీ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయని తెలిపారు.
శనివారం గరుట్, సుమేడాంగ్‌తో సహా పశ్చిమ జావాలోని అనేక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. ఇదిలా ఉండగా ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇండోనేషియా వాతావరణ శాఖ హెచ్చరించింది.