26రోజుల పసికందుకి కరోనా, చనిపోయిన తర్వాత శవపరీక్షలో తెలిసింది

26 రోజుల పసికందు కరోనా బారిన పడినట్టు చనిపోయిన తర్వాత అటాప్సీలో(శవ పరీక్ష) తెలిసింది. పెన్సిల్వేనియాలో ఈ ఘటన జరిగింది. ఎలాంటి చలనం లేకపోవడంతో ఆదివారం(జూలై 19,2020) ఉదయం పసికందుని రీడింగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అడ్మిట్ చేశారు. కాసేపటికే పసికందు చనిపోయింది. మృతదేహానికి శవపరీక్ష చేయగా షాకింగ్ విషయం తెలిసింది. పసికందు కరోనా బారిన పడినట్టు గుర్తించారు. గురువారం(జూలై 23,2020) వచ్చిన నివేదికలో ఈ విషయం తెలిసింది. అయితే పాప మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. కరోనా సోకడం వల్లే చనిపోయిందా లేక మరో కారణమా అని తెలుసుకునే పనిలో డాక్టర్లు ఉన్నారు. దీనిపై ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారు. టాక్సీకాలజీ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్టు డాక్టర్లు తెలిపారు.
కరోనాతో చనిపోయిన అతిపిన్న వయస్కురాలు:
పసికందు ఆంటీ కరోనా బారినపడింది. దీంతో డాక్టర్లు పసికందుకి కూడా కరోనా టెస్టు చేయాల్సి వచ్చింది. అయితే ఆ మహిళ పసికందుతో కాంటాక్ట్ అయిందో లేదో తెలియాల్సి ఉంది. ఒకవేళ కరోనా వైరస్ కారణంగానే పసికందు చనిపోయినట్టు నిర్ధారణ అయితే, ఆ రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన అతి పిన్న వయస్కురాలు ఈ పసికందే అవుతుంది. గత మార్చిలో ఓ శిశువు కరోనా కారణంగా చనిపోయినట్టు ఇల్లినాయిస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధికారులు తెలిపారు. కానీ ఆ శిశువు వయసు వెల్లడించ లేదు. ఆ తర్వాత కొన్ని రోజులకే, 6 వారాల పసికందు కూడా కరోనాతో మరణించింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కరోనాతో చనిపోయిన శిశువుల డేటాను ప్రత్యేకంగా కౌంట్ చేయడం లేదు. అందుకు బదులుగా సున్నా నుంచి 24ఏళ్ల వయసుగా వర్గీకరణ చేసి మృతుల లెక్కలు సేకరిస్తోంది. సున్నా నుంచి 24ఏళ్ల వయసు మధ్యలోని వారు ఇప్పటివరకు 226మంది కొవిడ్ తో మరణించారు.
42లక్షల కేసులు, లక్షా 48వేల మరణాలు:
అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా నమోదవుతున్న దేశాల్లో అమెరికాదే అగ్రస్థానం. ఆ తర్వాత భారత్, బ్రెజిల్ ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 76వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు అమెరికాలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 42లక్షల 48వేల 429కి చేరింది. ఇక కరోనా బారినపడి గడిచిన 24 గంటల్లో 1,225 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు అమెరికా వ్యాప్తంగా కరోనాతో లక్షా 48వేల 492మంది చనిపోయారు.