పోలియోను జయించిన ఆఫ్రికా దేశం : WHO

ఆఫ్రికా ఖండం మరో ఘనతను సొంతం చేసుకుంది. పోలియోను జయించిన ఖండంగా రికార్డులకెక్కింది. గత నాలుగేళ్లలో ఒక్కటంటే ఒక్క కేసు కూడా ఈ ఖండంలో నమోదు కాకపోవడంతో ఆఫ్రికాను పోలియో రహిత ఖండంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. గత నాలుగేళ్లలో కొత్తగా పోలియో కేసులు ఏవీ నమోదు కాలేదని ఆఫ్రికాను మంగళవారం (ఆగస్టు 25,2020) వైరస్ రహితంగా ప్రకటించినట్లు ఆఫ్రికా రీజినల్ సర్టిఫికేషన్ కమిషన్ ఫర్ పోలియో నిర్మూలన తెలిపింది. 40 సంవత్సరాల క్రితం మశూచిని నిర్మూలించిన తరువాత ఆఫ్రికా ఖండం పోలియో వైరస్ నిర్మూలించబడటం ఇది రెండవసారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
ఆఫ్రికా దేశమైన ఈశాన్య నైజీరియాలో చివరిసారి నాలుగేళ్ల క్రితం ఒకే ఒక్క పోలియో కేసు నమోదైంది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అంటే పోలియో మహమమ్మారి ఉనికి లేకుండా పోయింది.
పోలియోను తరిమికొట్టడంలో ప్రభుత్వం, దాతలు, ఆరోగ్యకార్యకర్తలు, కమ్యూనిటీలు చేసిన కృషి ప్రశంసనీయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది. వారి కృషి ఫలితంగా 1.8 మిలియన్ మంది చిన్నారులు పోలియో నుంచి బయటపడ్డారని కొనియాడింది.
పోలియో నిర్మూలన కోసం గత 30 ఏళ్లుగా కృషి చేస్తున్నామని నైజీరియా వైద్యుడు, రోటరీ ఇంటర్నేషనల్ స్థానిక యాంటీ పోలియో కోఆర్డినేటర్ తుంజీ ఫన్‌షో అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పోలియో నిర్మూలనలో ఇది ఎంతో కీలకమైన దశ అని, తమ ఖండం నుంచి పోలియోను తరిమికొట్టినందుకు చెప్పలేనంత ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ఆఫ్రికా ఖండం పోలియో రహితంగా మారినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ కలిసి అధికారికంగా ప్రకటించారు.
https://10tv.in/corona-infected-with-brazil-president-jair-bolsanaro/
ఆఫ్రికాలో పోలియో సంవత్సరానికి 75,000 మంది చిన్నారులు ప్రభావితమైన పరిస్ధితులుండేవి. నైజీరియాలో ప్రతీ ఐదురుగురు చిన్నారుల్లో ఒకరు పోలియో ప్రభావితంగా ఉండేవారు. అటువంటి దుర్భర పరిస్థితుల నుంచి పూర్తిగా పోలియో రహిత దేశంగా పేరు తెచ్చుకుంది నైజీరియా. ఇది నమ్మశక్యం కాని ఓ ఆనందకర అంశమని WHO ఆఫ్రికా డైరెక్టర్ మాట్షిడిసో మొయిటి అన్నారు.