Pakistan Afghanistan Border Clash: సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణలు.. పాకిస్తాన్, అఫ్ఘానిస్థాన్ కీలక నిర్ణయం.. 48 గంటలు..
దాడుల్లో 23 మంది పాకిస్తాన్ సైనికులు మరణించగా, 29 మంది గాయపడ్డారని తెలుస్తోంది.

Pakistan Afghanistan Border Clash: పాకిస్తాన్, అఫ్ఘానిస్థాన్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. కాల్పుల విరమణకు అంగీకరించాయి. బుధవారం సాయంత్రం నుంచి 48 గంటల తాత్కాలిక కాల్పుల విరమణకు పాకిస్తాన్, అఫ్ఘానిస్థాన్ అంగీకరించినట్లు పాక్ పత్రిక డాన్ నివేదించింది. కాగా, వారం రోజుల పాటు సరిహద్దు ఘర్షణలు కొనసాగాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గణనీయంగా దెబ్బతిన్నాయి.
పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం (FO) దీన్ని ధృవీకరించింది. అఫ్ఘాన్ తాలిబన్ పాలన అభ్యర్థన మేరకు “రెండు పార్టీల పరస్పర అంగీకారంతో” కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లు వివరించింది. ఈ సమయంలో నిర్మాణాత్మక సంభాషణ ద్వారా సమస్యకు సానుకూల పరిష్కారాన్ని కనుగొనడానికి ఇరుపక్షాలు నిజాయితీగా ప్రయత్నాలు చేస్తాయని పాక్ విదేశాంగ కార్యాలయం తెలిపింది.
అఫ్ఘాన్ భూభాగం నుండి జరిగిన దాడులకు ప్రతిస్పందనగా కాందహార్, కాబూల్‌లోని కీలక తాలిబన్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఖచ్చితమైన దాడులు నిర్వహించిన కొన్ని గంటల తర్వాత ఈ ప్రకటన వెలువడిందని మిలిటరీ మీడియా విభాగం, ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) తెలిపింది. దాడుల్లో 23 మంది పాకిస్తాన్ సైనికులు మరణించగా, 29 మంది గాయపడ్డారని తెలుస్తోంది.
కాబూల్‌లోని తెహ్రిక్ ఎ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) స్థావరాలపై గత వారం పాక్ సైన్యం దాడి చేసింది. తాము టీటీపీకి ఆశ్రయం ఇవ్వడం లేదని, పాకిస్థాన్ ఆరోపణల్లో నిజం లేదని అఫ్ఘానిస్థాన్ కొట్టిపారేసింది. కాబూల్‌పై దాడులకు ప్రతీకారంగా పాక్ సరిహద్దుల్లోని ఔట్‌పోస్టులపై తాలిబన్లు దాడులకు పాల్పడ్డారు. దాంతో రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.