బ్రిటన్ ప్రధానికి ఎదురుదెబ్బ

  • Published By: venkaiahnaidu ,Published On : September 3, 2019 / 04:19 PM IST
బ్రిటన్ ప్రధానికి ఎదురుదెబ్బ

Updated On : September 3, 2019 / 4:19 PM IST

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కు పార్లమెంటులో ఎదురుదెబ్బ తగిలింది. అక్టోబరు 31 తర్వాత బ్రెగ్జిట్‌ ఒప్పందంపై ఓటింగ్‌ జరుగనున్న సమయంలో సొంతపార్టీ ఎంపీ డాక్టర్‌ ఫిలిఫ్‌ లీ పార్టీని వీడుతున్నట్లు ఓ లేఖ రాశారు. దీంతో బోరిస్ పార్లమెంటరీ  మెజార్టీ కోల్పోయారు. తాను లిబరల్‌ డెమోక్రట్స్‌ పార్టీలో చేరుతున్నట్లు  ఫిలిఫ్ లీ ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు  బోరిస్‌ జాన్సన్‌  కు రాసిన లేఖలో తెలిపారు. ఇప్పటికే అసంతృప్త ఎంపీలతో సతమతమవుతున్న అధికార పార్టీకి ఫిలిఫ్‌ లీ రాజీనామా మరో సమస్యగా మారింది. 

అక్టోబర్‌ 31 నాటికి బ్రెగ్జిట్‌ ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటే, పార్లమెంట్‌ను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాల్సి వుంటుందని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రెబల్స్‌ను హెచ్చరించారు. ఐరోపా కూటమి నుండి బ్రిటన్‌ నిష్క్రమణ నిర్ణీత గడువులోనే జరుగుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం జరగదని ఆయన స్పష్టం చేశారు. బ్రెగ్జిట్‌పై ఐరోపా కూటమితో ఒప్పందం కుదిరినా, కుదరకపోయినా అక్టోబర్‌ 31 నాటికి బ్రెగ్జిట్‌ ప్రక్రియను పూర్తి చేసి తీరుతామని ఆయన ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే.