సౌదీ రాజు రాజకీయం : పాక్ ఏది అడిగినా కాదనలేం

  • Published By: venkaiahnaidu ,Published On : February 18, 2019 / 07:30 AM IST
సౌదీ రాజు రాజకీయం : పాక్ ఏది అడిగినా కాదనలేం

Updated On : February 18, 2019 / 7:30 AM IST

సౌదీ యువరాజు మొహమద్ బిన్ సల్మాన్ తన మొదటి అధికారిక పాక్ పర్యటనలో పాక్ కి వరాల జల్లు కురిపించాడు. పాక్ కు ఆర్థికంగా ఊతమిచ్చేలా  20 బిలియన్ డాలర్ల విలువైన భారీ ఒప్పందంపై ఆదివారం(ఫిబ్రవరి-17,2019) సౌదీ సంతకాలు చేసింది. దక్షిణాసియా, చైనా పర్యటనలో భాగంగా మొదటగా పాక్ లో ఆదివారం(ఫిబ్రవరి-17,2019) అడుగుపెట్టిన  సౌదీ యువరాజుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆర్మీ చీఫ్ జావేద్ బజ్వా రావల్పిండి మిలటరీ ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు. ప్రొటోకాల్ ని బ్రేక్ చేస్తూ ప్రధాని నివాసానికి బిన్ సల్మాన్ ని తన కారులో తనే డ్రైవ్ చేసి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా రిఫైనింగ్,పెట్రో, కెమికల్ రంగాల్లో సహా సౌదీ వస్తువుల దిగుమతి, విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు, ఇంధన ప్రాజెక్టులు, క్రీడారంగంలో సహకారంకి సంబంధించి పాక్ తో సౌదీ ఒప్పందాలు కుదుర్చుకొంది. తమ సోదరదేశమైన పాక్ ఆర్థిక భవిష్యత్తు తమకు చాలా ముఖ్యమని ఈ సందర్భంగా సౌదీ యువరాజ్ బిన్ సల్మాన్ తెలిపారు. ఈ సందర్భంగా సౌదీలో పనిచేస్తున్న 25లక్షల మంది కార్మికులకు సాయమందిచాల్సిందిగా బిన్ సల్మాన్ ను ఇమ్రాన్ కోరారు. తాను చేయగలిగనదంతా చేస్తానని, పాక్ కు నో అని చెప్పలేమని, సౌదీ అరేబియాలో తనని పాక్ అంబాసిడర్ గా గుర్తించాలని బిన్ సల్మాన్ అన్నారు. 

రెండు రోజుల పాక్ పర్యటన ముగిసిన అనంతరం భారత్ కి రానున్నారు బిన్ సల్మాన్. ఢిల్లీలో ప్రధాని మోడీ, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ లతో చర్చలు జరుపనున్నారు. ఆ తర్వాత చైనా పర్యటనకు వెళ్లనున్నారు.

ఓ వైపు పుల్వామా దాడితో భారత్ రగిలిపోతోంది. పాక్ పై యుద్ధానికి కూడా భారత్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ సమయంలో పాక్ లో సౌదీ యువరాజు పర్యటన కొత్త అనుమానాలకు దారి తీస్తోంది. ఓ వైపు అంతర్జాతీయంగా పాక్ ని ఏకాకి చేయాలని భారత్ ప్రయత్నాలు కొనసాగిస్తున్న సమయంలో పాక్ కి సౌదీ ఆర్థిక తోడ్పాటు అందిచడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.