అమెరికాపై చైనా ప్రతీకారం…చెంగ్డూలోని యూఎస్ ఎంబసీ మూసివేతకు ఆదేశం

  • Published By: venkaiahnaidu ,Published On : July 24, 2020 / 09:59 PM IST
అమెరికాపై చైనా ప్రతీకారం…చెంగ్డూలోని యూఎస్ ఎంబసీ మూసివేతకు ఆదేశం

Updated On : July 25, 2020 / 8:10 AM IST

హౌస్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం గూఢచర్యం, హ్యాకింగ్‌కు కేంద్రంగా మారిందని ఆరోపించిన అమెరికా 72 గంటల్లో ఖాళీ చేయాలంటూ మంగళవారం ఆదేశించడం, మరోవైపు ఈ నిర్ణయాన్ని అమెరికా వెనక్కి తీసుకోకపోతే ప్రతీకార చర్యలు తప్పవని చైనా హెచ్చరించిన విషయం తెలిసిందే.

ఈ సమయంలో అమెరికా చర్యకు వ్యతిరేకంగా చైనా ప్రతీకార చర్య చేపట్టింది. చైనాలోని చెంగ్డూ సిటీ‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాన్ని మూసివేయాలని శుక్రవారం కమ్యూనిస్ట్ దేశం ఆదేశించింది. అమెరికాలోని హౌస్టన్‌లో చైనా కాన్సులేట్ మూసివేతకు ప్రతీకారంగా ఈ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంది.

1985లో ఏర్పాటు చేసిన చెంగ్డూ అమెరికా రాయబార కార్యాలయంలో సుమారు 200 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 150 మంది స్థానిక చైనా దేశీయులేనని సమాచారం.

అమెరికా అసమంజసమైన చర్యలకు చట్టబద్ధమైన, అవసరమైన ప్రతిస్పందన ఇది అని చైనా విదేశాంగ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు అమెరికాదే బాధ్యత అని ఆరోపించింది.