China Population: చైనాను వీడని టెన్షన్.. వరుసగా మూడో ఏడాదీ భారీగా తగ్గిన ఆ దేశ జనాభా
చైనాలో ఈ ఏడాది జననాల రేటు స్వల్పంగా పెరిగినప్పటికీ జనాభా పెరుగుదలపై పెద్దగా ప్రభావం చూపలేదని చైనా జాతీయ ఏజెన్సీ పేర్కొంది.

China Population
China Population: గత కొన్నేళ్లుగా చైనాను జనాభా క్షీణిత సమస్య వేధిస్తోంది. రోజురోజుకు జననాల రేటు తగ్గుతుండటంతో ఆ దేశ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. గత మూడేళ్లుగా ఇదేపరిస్థితిని చైనా ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో దేశంలో జననాల రేటును పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. వరుసగా మూడో ఏడాది కూడా ఆ దేశ జనాభా తగ్గింది. ఈ పరిణామం చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒకే సంతానం విధానాన్ని కొన్నేళ్లపాటు అమలు చేయడంతో ఆ దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగి.. యువత సంఖ్య తగ్గింది.
ఈ ఏడాది చైనాలో జననాల రేటు స్వల్పంగా పెరిగినప్పటికీ జనాభా పెరుగుదలపై పెద్దగా ప్రభావం చూపలేదని చైనా జాతీయ ఏజెన్సీ పేర్కొంది. చైనా నేషనల్ స్టాటిస్టిక్స్ బ్యూరో శుక్రవారం ఆ దేశంలో జనాభాకు సంబంధించి కొత్త గణాంకాలను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం.. 2024లో జనాభా 1.39 మిలియన్ల క్షీణత నమోదైంది. తద్వారా ఆ దేశ జనాభా 140.80 కోట్లకు పడిపోయింది. అయితే, 2024 సంవత్సరంలో దేశంలో దాదాపు 9.54 మిలియన్ల మంది పిల్లలు జన్మించారు. ఇది గత సంవత్సరం కంటే 5,20,000 ఎక్కువ. ఇదిలాఉంటే.. 2023 ఏడాదిలో చైనా జనాభా 20.8లక్షలు తగ్గి 140.97కోట్లకు పడిపోయింది. 2022లో చైనాలో 95.6 లక్షల మంది జన్మిస్తే.. 2023లో 90.2లక్షల మంది జన్మించారు. కొవిడ్ కారణంగా 2023 ఏడాదిలో ఎక్కువ మంది చనిపోవడమూ జనాభా తగ్గుదలకు మరో కారణమైందని అప్పట్లో చైనా పేర్కొంది.
ఒక దేశ ఆర్థిక శక్తిని ముందుకు నడిపించడంలో అత్యంత కీలక పాత్ర పోషించేది మానవ వనరులు. అంటే పనిచేసే వయస్సు (యువకులు) ఉన్న వారు. జనాభా అండతోనే ప్రపంచంలోనే బలమైన ఆర్థిక శక్తిగా చైనా ఎదిగింది. అలాంటి దేశానికి ప్రస్తుతం జనాభా తగ్గుదల సమస్య వేధిస్తోంది. ఆ దేశంలో గత క్నొనేళ్ల క్రితం జనాభా పెరుగుదలపై నియంత్రణ విధించడంతో ప్రస్తుతం ఈ సమస్య తలెత్తుతుంది. దీనిని గుర్తించిన చైనా ప్రభుత్వం 2016లో ఒక బిడ్డ విధానాన్ని ఎత్తివేసింది. ముఖ్యంగా గత నాలుగేళ్ల నుంచి జనాభా పెరుగుదలపై ఆ దేశ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎక్కువ మంది పిల్లలను కనేందుకు దంపతులను ప్రోత్సహించేందుకు ప్రోత్సాహకాలనుసైతం అక్కడ ప్రభుత్వం ప్రకటించింది. ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కటుంబాలకు ఇల్లు, ఆరోగ్య సంరక్షణ, ఉపాధి అవకాశాలు అందించడంపైనా చైనా ప్రభుత్వం దృష్టిపెట్టింది.
చైనాతోపాటు భారతదేశంలోనూ జనాభా క్రమంగా తగ్గుతుంది. చైనా, భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో జనాభా క్షీణతపై అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఈ ఏడాది ప్రారంభంలో ఆందోళన వ్యక్తం చేశాడు. రాబోయే కాలంలో ఈ సమస్య ప్రపంచం ఎదుర్కొనే అత్యంత తీవ్రమైన సవాళ్లలో ఒకటని మస్క్ అభిప్రాయ పడ్డారు. ఇటీవల ఓ సేర్వే ప్రకారం.. వచ్చే 75ఏళ్లలో చైనా జనాభా 73కోట్లకు తగ్గొచ్చని అంచనా వేసింది. ఇదేజరిగితే ఆ దేశ ఆర్థిక పురోగతికి పెను ప్రమాదం పొంచిఉన్నట్లేనని చెప్పొచ్చు. బ్లూమ్ బెర్గ్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం.. 2035నాటికి చైనా జనాభా 1.36 బిలియన్లకు (136 కోట్లకు) పడిపోతుందని అంచనా వేసింది.