International Women’s Day..Clara zetkin : క్లారా జెట్కిన్ ఆలోచనలకు ప్రతీరూపం..అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఆవిర్భావం
క్లారా జెట్కిన్ ఆలోచనలకు ప్రతీరూపం..అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఆవిర్భావం.

Clara Zetkin is the effete behind International Women's Day
International Women’s Day..Clara zetkin :
ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు..
నడవరా ముందుగా.. అటో ఇటో ఎటో వైపు..
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి..
వెనుక వచ్చువాళ్ళకు బాట అయినది..!
అనే మాట ఎన్నో పోరాటాలకు ప్రతిరూపం అని చెప్పాలి. 100 ఏళ్లకుపైగా జరుపుకుంటున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం వెనక కూడా ఓ మహిళ ఒంటరి అడుగు..ఆమెకు వచ్చిన ఓ ఆలోచన వేలాది అడుగులకు బాటగా మారింది. ఆమెకు వచ్చిన ఆ ఆలోచన మహిళల జీవితాల్లో వెలుగులు నింపింది. ఆమే క్లారా జెట్కిన్ . క్లారా జెట్కిన్ జర్మన్ మార్క్సిస్ట్ సిద్ధాంతకర్త, కమ్యూనిస్ట్ కార్యకర్త, మహిళల హక్కుల కోసం పోరాడిన ధీర.ఇలా ఆమె గురించి చెప్పుకుంటూ పోతే ఆమె పోరాటాలు..మహిళా హక్కుల కోసం ఆమె చేసిన కృషి అంతా ఇంతా కాదు. శతాబ్ద కాలానికి ముందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆవిర్భావానికి ఆమె ఆలోచనలే నాంది పలికాయి..మహిళ కోసం ఓ రోజు ఉండాలని..ఆమె చేసిన ప్రతిపాదనకు వేలాదిమంది మహిళలు ఏకగ్రీవంగా ఆమోదించారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ రంగాల్లో ఎదగటానికి క్లారా జెట్కిన్ కు వచ్చిన ఆ ఆలోచనలే బీజం వేశాయి. మహిళలు కూడా తమ హక్కుల కోసం పోరాడగలరే ధైర్యాన్ని..తెగింపును..పోరాటపటిమను రాజేశాయి క్లారా జెట్కిన్ ఆలోచనలు..
కార్మికుల ఉద్యమాల నుంచి పుట్టుకువచ్చిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తింపు వచ్చేలా చేసింది. ఈ వేడుకలను కేవలం ఒక దేశంలో ఉండే మహిళలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవాలని క్లారా జెట్కిన్ భావించారు. డెన్మార్క్ రాజధాని కోపెన్‌హెగెన్‌లో 1910లో నిర్వహించిన, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ సమావేశంలో క్లారా జెట్కిన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రతిపాదన చేశారు. ఈ సమావేశానికి ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది మహిళ ప్రతినిధులు హాజరై క్లారా నిర్ణయాన్ని ఏకగ్రీవం చేశారు.
Women’s Day 2022: స్పెషల్ స్లైడ్స్‌తో..మహిళలకు గొప్పదనాన్ని చాటిచెప్పిన గూగుల్ డూడుల్
దీనికి పుట్టుకకు బీజాలు 1908లో పడ్డాయి. మహిళలకు మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు, ఆరోగ్యం, తక్కువ పనిగంటల కోసం న్యూయార్క్ సీటీలో దాదాపు 15 వేల మంది మహిళలు నిరసన ప్రదర్శన చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న అమెరికా సోషలిస్టు పార్టీ 1909లో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. మహిళా దినోత్సవాన్ని మొదటిసారి 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్‌లలో నిర్వహించారు. 1975 నుంచి ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించడం ప్రారంభించి ప్రతి ఏటా ఒక థీమ్‌తో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ రంగాల్లో మహిళలు ఎంత ఎదిగారో తెలుసుకోవడానికి ఈ వేడుకలను నిర్వహిస్తోంది.
మార్చి 8నే మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి?
1917 యుద్ధంలో రష్యా మహిళలు శాంతి నిరసన చేశారు. ఆ సమయంలో కొన్ని రోజుల తర్వాత అప్పటి రష్యా సామ్రాట్ నికోలస్ జా 2 సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో తాత్కాలికంగా ఏర్పడిన ప్రభుత్వం మహిళలకు ఓటువేసే హక్కును కల్పించింది. మహిళలు సమ్మెకు దిగిన రోజు అప్పటి రష్యా కేలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23 ఆదివారం. గ్రెగేరియన్ కేలెండర్ ప్రకారం మార్చి 8. రష్యాలో నాలుగురోజుల పాటు వేడుకలు చేసుకుంటారు. 8 కి ముందు ఆ తర్వాత పూల కొనుగోళ్లు కూడా అధికమవుతాయి. ఆ రోజు సెలవుదినంగా పాటిస్తారు.
ప్రతీ ఏడాది అంతర్జాతీయ మహిళల దినోత్సవాన్ని మార్చి 8వ తేదీన జరుపుకుంటారు. ఈ దినోత్సవం రోజున ప్రపంచ వ్యాప్తంగా సాధికారత సాధించిన మహిళల గురించి తెలుసుకుని, వారి జీవితంలో సాధించిన వాటిని గుర్తుచేసుకుంటారు. మహిళలు ఎలా సాధికారత దిశగా అడుగులు వేయటానికి తమ సమస్యలు తామే స్వయంగా పరిష్కరించుకోవటానికి అవగాహన కల్పిస్తారు. సాధికారత గురించి తెలుసుకుంటారు.
జర్మనీకి చెందిన క్లారా జెట్కిన్ ఈ మహిళల దినోత్సవానికి నాందిపలికారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఠక్కున గుర్తుకొచ్చేది ఆమె పేరే అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదంటే అతిశయోక్తి కాదు. క్లారా జెట్కిన్ కు వచ్చిన ఆలోచనలు ఈ కంప్యూటర్ యుగంలో కూడా అణగారిన వర్గాలకు చెందిన మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.
International Women’s Day: అంతర్జాతీయ మహిళా దినోత్సవం చరిత్ర.. ఆ మూడు రంగుల ప్రత్యేకతలు ఇవే..
ఉపాధ్యాయురాలిగా..జర్నలిస్టుగా క్లారా జెట్కిన్..
జులై 5, 1857లో జన్మించిన క్లారా జెట్కిన్ ఉపాధ్యాయురాలిగా పనిచేచేశారు. సోషల్ డెమోక్రాటిక్ పార్టీతో కలిసి మహిళల ఉద్యమం, కార్మిక ఉద్యమాన్ని నడిపించారామె. 1880లో అప్పటి జర్మనీ అధినేత ఒట్టోవాన్ బీస్మార్క్ సోషలిస్టు వ్యతిరేక చట్టాలను తీసుకురావటంతో దాన్ని వ్యతిరేకిస్తూ జర్నలిస్టుగా ఉన్న క్లారా జెట్కిన్ నిషేధిత సాహిత్యాన్ని ముద్రించారు. ఎంతో మంది సోషలిస్టులని కలిసి..అంతర్జాతీయ సోషలిస్టు ఏర్పడడానికి ఆమె చేసిన కృషి కూడా ఓ కారణం అని చెప్పాలి. జర్మనీకి తిరిగి వచ్చి 1892 నుండి 1917వరకు డైగ్లీచిన్ అనే వార పత్రిక సంపాదకురాలిగా పనిచేశారు క్లారా.
అప్పుడే అంతర్జాతీయ మహిళల దినోత్సవాన్ని ప్రతీ ఫిబ్రవరి 28వ తేదీన జరుపుకోవాలని నిర్ణయించారు. దాంతో 1911నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతీ దేశంలో జరుపుకుంటున్నారు. 1913 లో ఫిబ్రవరి 28నుండి మార్చి 8వ తేదీకి మార్చారు. అలా క్లారా జెట్కిన్ ఆలోచనల నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆవిర్భవించింది..అలా దాదాపు 110 ఏళ్లుగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం.