కరోనా భూతం : ప్రపంచవ్యాప్తంగా 52 వేల మంది మృతి

  • Published By: madhu ,Published On : April 3, 2020 / 02:02 AM IST
కరోనా భూతం : ప్రపంచవ్యాప్తంగా 52 వేల మంది మృతి

Updated On : April 3, 2020 / 2:02 AM IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కమ్మేసింది. 204 దేశాలకు వ్యాపించిన ఈ మహమ్మారి మరణమృదంగం మోగిస్తోంది. క్షణక్షణం కొత్త కేసులు నమోదు చేస్తూ ప్రపంచదేశాల్లో దడ పుట్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య ఏకంగా 10 లక్షలు దాటింది. ఇక మరణాల సంఖ్య 52 వేల 931 కి చేరింది. కరోనా కేసుల్లో అమెరికా మొదటి స్థానంలో ఉండగా… ఇటలీ, స్పెయిన్‌ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరణాల్లో 13 వేలకు పైగా ఇటలీ మొదటి స్థానంలో ఉండగా…స్పెయిన్‌ 10 వేలను దాటిసేంది.

అమెరికాలో : – 
అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా వైరస్‌ మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణుకుతోంది. ఇక్కడ రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరగడమే తప్ప తగ్గడం కనిపించడం లేదు. రోజుకు సగటున 20 వేల మందికిపైగా ఈ మహమ్మారి బారినపడుతున్నారు. ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదైన దేశంగా ఇప్పటివరకు ఇటలీ ఉండగా ఇప్పుడు ఆ స్థానంలో అమెరికా నిలిచింది. ఇప్పటివరకు దేశంలో మొత్తం 2 లక్షల 44 వేల మందికి పైగా కరోనా వ్యాధిన బారీన పడ్డారు. మరణాల సంఖ్య 5 వేలు దాటేసింది.

స్పెయిన్ లో : – 
స్పెయిన్‌లో కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య పది వేలు దాటింది. ఒక్క రోజులోనే కోవిడ్ కారణంగా 961 మంది మరణించారని స్పెయిన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ యూరోపియన్ దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య లక్షా 12వేలు దాటింది. గత కొద్ది రోజులుగా స్పెయిన్‌లో కోవిడ్ కేసుల సంఖ్య కొద్దిగా తగ్గుముఖం పట్టిందని భావించినా… మళ్లీ నిన్న దాదాపు 8వేల కొత్త కేసుల నమోదుతో మళ్లీ ఉలిక్కిపడింది. స్పెయిన్‌లో ఇప్పటి వరకూ కరోనా కారణంగా 10వేల 348మంది ప్రాణాలు వదిలారు. మరో ఆరు వేల మందికిపైగా ఐసీయూల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు.. కరోనా వైరస్ కారణంగా పది వేలకు పైగా మరణాలు నమోదైన రెండో దేశం స్పెయిన్. 

ఇటలీలో : – 
కరోనా ప్రభావంతో విలవిల్లాడుతున్న ఇటలీలో ప్రాణ నష్టం ఊహకు అందని రీతిలో అంతకు అంతకూ పెరుగుతోంది. గత వారం రోజుల నుంచి అక్కడ కరోనా వ్యాప్తి కాస్త నెమ్మదించినా మరణాల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. తాజాగా నిన్న 760 మంది మృతి చెందారు. ఇప్పటికే ఇటలీలో లక్షా 15వేల మందికిపైగా కోవిడ్ బారిన పడగా… 13వేల 915 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా కారణంగా ప్రపంచంలోని మరే దేశంలోనూ ఈ స్థాయిలో ప్రాణ నష్టం జరగలేదు.  గురువారం కొత్తగా 4వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 

ఫ్రాన్స్ లో : – 
ఫ్రాన్స్ లో కరోనా కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు బాధితుల సంఖ్యను పెంచేస్తూ మరణమృందంగం మోగిస్తోంది. గురువారం ఒక్కరోజే ఫ్రాన్స్‌లో గరిష్టంగా 1355 మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజు జరిగిన మరణాల్లో ఇదే అధికం. దీంతో ఆ దేశంలో మొత్తం మృతుల సంఖ్య 5వేలు దాటింది. మరో 6వేల మంది పరిస్థితి విషమంగా ఉంది. మొత్తంగా  ఫ్రాన్స్‌లో 59వేల మందికిపైగా కోవిడ్-19 బారినపడి ఆస్పత్రుల పాలవగా… 12వేల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 41వేలకు పైగా యాక్టివ్‌ కేసులున్నాయి.

Also Read | ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనా మరణం