కరోనాను కనిపెట్టిన డాక్టర్ కుటుంబానికి వూహాన్ పోలీసుల క్షమాపణ

కరోనా వైరస్‌ను తొలి సారి గుర్తించిన డాక్టర్ లీ వెన్‌లియాంగ్.. ఆ వైరస్ సోకి మృతిచెందిన విషయం తెలిసిందే. వైరస్ మెదటగా వెలుగులోకి వచ్చిన వుహాన్ సిటీలో కంటి శస్త్రచికిత్స డాక్టర్ గా పనిచేసిన లీ వెన్‌లియాంగ్ తొలిసారిగా గతేడాది డిసెంబర్ లో కొత్త కరోనా వైరస్‌ను గుర్తించాడు. ఆ తర్వాత ఆ విషయాన్ని ఆయన వీచాట్‌లో తన మిత్రులతో షేర్ చేశాడు. (టోక్యో 2020 ఒలింపిక్స్..అథ్లెటిక్స్ పరిస్థితి ఏంటి?)
అయితే అనవసరంగా జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆ డాక్టర్‌ను పోలీసులు మందలించారు. తప్పుడు ప్రచారం చేస్తున్నాడని అతనిపై పోలీసులు కేసు కూడా పెట్టి అరెస్ట్ చేశారు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకు ఆయన చెప్పిందే నిజమవడంతో ఆయనను విడుదల చేశారు. అయితే ఆ తర్వాత ఆయన గుర్తించిన కరోనాకు సోకి ఆయన బలైపోయాడు.
అయితే వుహాన్ పోలీసులు ఇప్పుడు ఆ డాక్టర్ కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. సదురు పోలీసులు సరైన రీతిలో విచారణ చేపట్టలేదని పోలీసు శాఖ తన లేఖలో తెలిపింది. కుటుంబసభ్యులకు నష్టపరిహారం కూడా ఇవ్వాలని పోలీసులు నిర్ణయించారు. 34 ఏళ్ల డాక్టర్ లీ.. గత ఏడాది డిసెంబర్ లో… సార్స్ తరహాలో ఆ వైరస్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశాడు. నాలుగు రోజుల తర్వాత జాంగ్‌నాన్‌లూ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాతే వుహాన్ నగరం కరోనా వ్యాప్తికి కేంద్రబిందువుగా మారింది.
జనవరి 10వ తేదీన మళ్లీ విధుల్లో చేరిన ఆ డాక్టర్‌కు కొన్ని రోజుల తేడాలోనే కరోనా లక్షణాలు కనిపించాయి. రోగులకు చికిత్స చేస్తూనే ఆయన చివరకు తుది శ్వాస విడిచాడు. ఆ డాక్టర్ మరణంపై చైనా ప్రభుత్వ వర్గం ఒకటి విచారణకు ఆదేశించింది. మహమ్మారి గురించి హెచ్చరికలు చేసిన డాక్టర్‌ను అడ్డుకున్నందుకు .. సదురు పోలీసు స్టేషన్ అధికారులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఆ డాక్టర్ మరణం పట్ల చైనీయులు, ఇతర దేశస్థులు కూడా నివాళి అర్పించారు. డాక్టర్ లీ హెచ్చరికలు చేసినా మహమ్మారి నియంత్రణలో విఫలమైనట్లు చైనా అంగీకరించింది. డాక్టర్ లీ పట్ల గర్వంగా ఉందని, అతను సత్యమే చెప్పాడని ఆ దేశ శ్వాసకోస నిపుణుడు జాంగ్ నాన్‌షాన్ అన్నారు.