Human Metapneumovirus : ప్రమాదంలో 14 ఏళ్లలోపు పిల్లలు..! చైనాలో కొత్త వైరస్ కలకలం..
కరోనా సోకితే ఎలాంటి లక్షణాలు ఉంటాయో.. ఇది సోకినా అవే లక్షణాలు కనిపిస్తున్నాయి.

Human Metapneumovirus : కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఐదేళ్లకు చైనాలో మరో మహమ్మారి కలకలం రేగింది. చైనీయులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అదే హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (HMPV). ఈ మహమ్మారి పెరుగుదలతో చైనా పోరాడుతోంది. ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. సోషల్ మీడియా పోస్టులు, నివేదికలు ఈ విషయాన్ని సూచిస్తున్నాయి. రోగులతో అక్కడి ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. మృతదేహాలతో శ్మశానవాటికలు నిండిపోతున్నాయి.
కొత్త వైరస్ చైనాను టెన్షన్ పెడుతోంది. శ్వాసకోశ వ్యాధికి సంబంధించిన HMPV (హ్యూమన్ మెటాన్యుమోవైరస్) అక్కడ చాలా వేగంగా విస్తరిస్తోంది. కరోనా సోకితే ఎలాంటి లక్షణాలు ఉంటాయో.. ఇది సోకినా అవే లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ వైరస్ బారిన పడ్డ రోగులతో చైనాలోని ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. కాగా, చైనాలోని చాలా హాస్పిటల్స్ వైరస్ బాధితులతోనే కాకుండా ఇన్ ఫ్లూయెంజా ఏ, మైకోప్లాస్మా న్యుమోనియా, కొవిడ్-19 రోగులతో కిటకిలాడుతున్నాయి.
“ఇన్‌ఫ్లుఎంజా A, HMPV, మైకోప్లాస్మా న్యుమోనియా, కోవిడ్-19 వంటి బహుళ వైరస్‌ల పెరుగుదలను చైనా ఎదుర్కొంటోంది. న్యుమోనియా కేసులు కారణంగా పిల్లల ఆసుపత్రులు ముఖ్యంగా ఒత్తిడికి గురవుతున్నాయి” అని అక్కడి ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ వైరస్‌లు వేగంగా వ్యాప్తి చెందడం వల్ల చైనా అత్యవసర పరిస్థితిని ప్రకటించిందని కొందరు చెబుతున్నారు. ఈ విషయం అధికారికంగా ధృవీకరించబడలేదు. ఫ్లూ-వంటి లక్షణాలకు కారణమయ్యే HMPV.. కోవిడ్-19 మాదిరిగానే లక్షణాలను కలిగి ఉంది.
న్యుమోనియా కేసుల కోసం చైనా కొత్త మానిటరింగ్ సిస్టమ్‌ను పరీక్షిస్తోంది…
తెలియని మూలం ఉన్న న్యుమోనియా కేసులను పర్యవేక్షించడానికి చైనా వ్యాధి నియంత్రణ అథారిటీ కొత్త వ్యవస్థను ప్రయోగాత్మకంగా రూపొందిస్తున్నట్లు రాయిటర్స్ నివేదిక పేర్కొంది. పర్యవేక్షణ వ్యవస్థ.. అభివృద్ధి చెందుతున్న వ్యాధి కారకాలను నిర్వహించడానికి సంసిద్ధతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా ఐదేళ్ల క్రితం కోవిడ్ -19 వైరస్ మొదటిసారి ఉద్భవించినప్పుడు సంసిద్ధత లేకపోవడం ఆ మహమ్మారి వ్యాప్తికి కారణమైంది.
ప్రత్యేకించి డిసెంబర్ 16 నుంచి 22 మధ్య అంటువ్యాధుల పెరుగుదల ధోరణిని చూపించింది. దీంతో నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అడ్మినిస్ట్రేషన్ అలర్ట్ అయ్యింది. కేసులను నివేదించడానికి ప్రయోగశాలలకు, వ్యాధి నియంత్రణ ఏజెన్సీలు వాటిని ధృవీకరించే ప్రక్రియపై పనిచేస్తోంది.
ప్రమాదంలో 14 ఏళ్లలోపు పిల్లలు..
ఉత్తర చైనాలో పెరుగుతున్న HMPV, ముఖ్యంగా 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ప్రభావితం చేస్తోంది. షాంఘై ఆసుపత్రికి చెందిన ఒక శ్వాసకోశ నిపుణుడు ఈ విషయాన్ని తెలిపారు. యాంటీవైరల్ ఔషధాల విచక్షణారహిత వినియోగాన్ని నివారించాలని ప్రజలకు సూచించారు. HMPVతో పోరాడాలని పిలుపునిచ్చారు. ఎందుకంటే వైరస్‌కు వ్యాక్సిన్ లేదన్నారు. ఇక, దాని లక్షణాలు జలుబును పోలి ఉంటాయన్నారు.
Also Read : చైనాను వణికిస్తున్న మరో మహమ్మారి..! HMVP వైరస్ అంటే ఏమిటి? లక్షణాలు ఏంటి?