Delta Variant Dr Fauci : డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకరం, అమెరికా అప్రమత్తంగా ఉండాలి

Delta Variant Dr Fauci : డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకరం, అమెరికా అప్రమత్తంగా ఉండాలి

Delta Variant Dr Fauci

Updated On : July 1, 2021 / 5:22 PM IST

Delta Variant Dr Fauci : ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని కరోనా డెల్టా వేరియంట్ ఆందోళనకు గురి చేస్తోంది. చాలా దేశాల్లో డెల్టా వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. అంతేకాదు ఇది అత్యంత ప్రమాదకరం అని, వేగంగా వ్యాపిస్తోందని నిపుణులు చెబుతున్న మాటలు మరింత కలవరపెడుతున్నాయి. తాజాగా డెల్టా వేరియంగ్ గురించి వైట్ హౌస్ చీఫ్ మెడికల్ అడ్వయిజర్ డాక్టర్ ఆంటోనీ ఫౌసీ చేసిన హెచ్చరికలు భయాందోళనకు గురి చేస్తున్నాయి.

కరోనా మహమ్మారిపై అమెరికా చేస్తున్న పోరాటానికి డెల్టా వేరియంట్ తీవ్రమైన విఘాతం కలిగించే ప్రమాదం ఉందని వైట్ హౌస్ చీఫ్ మెడికల్ అడ్వయిజర్ డాక్టర్ ఆంటోనీ ఫౌసీ హెచ్చరించారు. ప్రస్తుతం వెలుగుచూస్తున్న డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకరమైనదని, ఈ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. ఇది సోకితే ప్రాణాలు పోయే ప్రమాదం అధికం అన్నారు.

ఏడాదిన్నర నాడు వెలుగులోకి వచ్చి, ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన కరోనా, ఆపై వచ్చిన పలు రకాల వేరియంట్లతో పోలిస్తే, ఇది భిన్నమైనదని వైట్ హౌస్ కొవిడ్-19 రెస్పాన్స్ టీమ్ ను ఉద్దేశించి డాక్టర్ ఫౌసీ అన్నారు. ప్రస్తుతం అమెరికాలో వెలుగు చూస్తున్న కొత్త కరోనా కేసుల్లో 20 శాతం డెల్టా వేరియంట్ వేనని వెల్లడించిన ఆయన, రెండు వారాల క్రితం ఇవి 10 శాతం ఉండేవని, 15 రోజుల వ్యవధిలోనే డెల్టా వేరియంట్ కేసులు రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు.

యూకేలో వెలుగులోకి వచ్చిన స్ట్రెయిన్ మాదిరిగానే ఇది కూడా ప్రాణాంతకమేనని, దీనిపై ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదని ఫౌసీ అన్నారు. ఇదే సమయంలో ఆయన ఓ శుభవార్తను కూడా చెప్పారు. అమెరికాలో తయారవుతున్న వ్యాక్సిన్లు డెల్టా వేరియంట్ ను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాయని అన్నారు.