ప్రజాస్వామ్య సూచిక : 51వ ర్యాంకుకు పడిపోయిన భారత్ 

  • Published By: sreehari ,Published On : January 22, 2020 / 01:18 PM IST
ప్రజాస్వామ్య సూచిక : 51వ ర్యాంకుకు పడిపోయిన భారత్ 

Updated On : January 22, 2020 / 1:18 PM IST

ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటిగా పేరొందిన భారత్ 51వ ర్యాంకుకు పడిపోయింది. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ విడుదల చేసిన తాజా ప్రజాస్వామ్య సూచికలో భారత్ 10 స్థానాలకు పడిపోయి 51వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాల్లోని 165 దేశాలు, రెండు ప్రాదేశిక ప్రాంతాలకు సంబంధించి జాబితాను ప్రజాస్వామ్య సూచిక 2019 విడుదల చేసినట్టు న్యూస్, జనరల్ అఫైర్స్ పబ్లికేషన్స్ తమ వార్షిక నివేదికలో వెల్లడించింది.

ప్రధానంగా భారత్ లో పౌరసత్వ సవరణ చట్టంతో వివక్షత, పౌర స్వేచ్ఛను హరించడం, జమ్మూకశ్మీర్ లో అనిశ్చితి, జాతీయ పౌరుల పట్టిక (NRC) వివాదాస్పదం వంటి పలు అంశాలే భారత్ ర్యాంకు పడిపోవడానికి ప్రధాన కారణమని నివేదిక తెలిపింది. 

ప్రజాస్వామ్య సూచికలో 2016లో 7.81 గా ఉన్న భారత్.. 2017-2018 నాటికి 7.23 నుంచి 2019 నాటికి 6.90 కు పడిపోయిందని పేర్కొంది. ఈ సూచిక మొత్తం (ఎన్నికల ప్రక్రియ, బహుత్వవాదం, ప్రభుత్వ పనితీరు, రాజకీయ భాగస్వామ్యం, రాజకీయ సంస్కృతి, పౌర స్వేచ్ఛ) ఐదు కేటగిరీలుగా విభజించి ర్యాంకులను ఇచ్చింది. దీని మొత్తం స్కోరు ఆధారంగా ఆయా దేశాలన్నీ నాలుగు రకాల పాలనలో ఒకటిగా వర్గీకరించింది.

పూర్తి ప్రజాస్వామ్యం (8 కంటే ఎక్కువ స్కోరు), లోభూయిష్ట ప్రజాస్వామ్యం (6 కంటే ఎక్కువ, 8 కంటే తక్కువ లేదా సమానం), హైబ్రిడ్ పాలన (4 కంటే ఎక్కువ, 6 కంటే తక్కువ లేదా సమానం), అధికార పాలన (4 కంటే తక్కువ లేదా సమానం)గా విభజించి స్కోర్లు ఇచ్చింది. 

టాప్ ర్యాంకులో నార్వే :
ఈ మొత్తం ప్రజాస్వామ్య సూచిక 2019 జాబితాలో మొత్తం మీద నార్వే టాప్ ర్యాంకులో నిలిచింది. ఆ తర్వాతి ర్యాంకుల్లో ఐస్ ల్యాండ్, స్వీడన్ వరుసగా నిలిచాయి. ఇతర దేశాల్లో టాప్ 10లో న్యూజిలాండ్ నాల్గో ర్యాంకులో నిలవగా, ఫిన్ లాండ్ (5వ ర్యాంకు), ఐర్లాండ్ (6వ ర్యాంకు), డెన్మార్క్ (7వ ర్యాంకు), కెనడా (8వ ర్యాంకు) ఆస్ట్రేలియా (9వ ర్యాంకు), స్విట్జర్లాండ్ (10వ ర్యాంకు)లో ఉన్నాయి. 

ఇదిలా ఉండగా, ఈ జాబితాలో పాకిస్థాన్ 4.25 స్కోరుతో 108వ ర్యాంకులో నిలిచింది. శ్రీలంక (6.27 స్కోరు)తో 69వ ర్యాంకులో నిలవగా, బంగ్లాదేశ్ (5.88 స్కోరు)తో 80వ ర్యాంకులో నిలిచాయి. చైనా స్కోరు మాత్రం 2019 సూచికలో 2.26 స్కోరుకు పడిపోయి ప్రపంచ ర్యాంకింగ్స్ లో దిగువన 153వ ర్యాంకులో నిలిచిపోయింది. ఉత్తర కొరియా మాత్రం అదే గ్లోబల్ ర్యాంకింగ్స్ లో 167వ ర్యాంకుతో దిగువకు పడిపోయింది.