డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారీ ఆఫర్.. ఆ వ్యక్తిని పట్టిస్తే ఏకంగా రూ.437 కోట్లు ఇస్తుందట.. ఇంతకీ ఏవరా వ్యక్తి.. ఏం చేశాడంటే..

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడే నికోలస్ మదురోపై 15మిలియన్ల డాలర్లు రివార్డును ప్రకటించారు. తరువాత బైడెన్ సర్కార్ దాన్ని 25 మిలియన్ డాలర్లకు పెంచింది.

డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారీ ఆఫర్.. ఆ వ్యక్తిని పట్టిస్తే ఏకంగా రూ.437 కోట్లు ఇస్తుందట.. ఇంతకీ ఏవరా వ్యక్తి.. ఏం చేశాడంటే..

Venezuela president Nicolas Maduro

Updated On : August 9, 2025 / 11:56 AM IST

Venezuela president Nicolas Maduro: అమెరికా ప్రభుత్వం భారీ ఆఫర్ ప్రకటించింది. వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై రివార్డును పెంచింది. మదురో సమాచారం ఇచ్చిన వారికి, అతని అరెస్టుకు సహకరించిన వారికి 50 మిలియన్ డాలర్లు (రూ.437కోట్లు) ఇస్తామని ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండి గురువారం ఓ వీడియో రిలీజ్ చేశారు.

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడే నికోలస్ మదురోపై 15మిలియన్ల డాలర్లు రివార్డును ప్రకటించారు. తరువాత బైడెన్ సర్కార్ దాన్ని 25 మిలియన్ డాలర్లకు పెంచింది. ఇప్పుడు మళ్లీ ట్రంప్ ప్రభుత్వం ఆ రివార్డును రెట్టింపు చేసింది. గతంలో ఒసామా బిన్ లాడెన్ ను పట్టుకోవడానికి కూడా అమెరికా ఇంతే మొత్తాన్ని ఆఫర్ చేసింది.

అమెరికా అటార్నీ జనరల్ పామ్‌బోండి మాట్లాడుతూ.. నికోలస్ మదురో అనే వ్యక్తి ట్రెన్ డి అరాగ్వా, సినలోహ, కార్టెల్ ఆఫ్ ది సన్స్ (కార్టెల్ డి సోలెన్) వంటి టెర్రర్ సంస్థలను ఉపయోగించి అమెరికాలో ఘోరమైన హింసకు పాల్పడుతున్నాడు. అతను ప్రపంచంలోని అతిపెద్ద నార్కోట్రాఫికర్లలో ఒకడు. అమెరికాలోకి ఫెంటానిల్ కలిపిన కొకైన్, తదితర డ్రగ్స్ సప్లయ్ చేస్తూ నార్కోటెర్రరిజానికి పాల్పడుతున్నాడు. ఇది జాతీయ భద్రతకే ముప్పు. ట్రంప్ ప్రభుత్వం నుంచి మదురో ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేడు. చేస్తున్న నేరాలకు అతను శిక్ష అనుభవించాల్సిందే అని పామ్ బోండి పేర్కొన్నారు.

వెనిజులా విదేశాంగ మంత్రి ఇవాన్ గిల్ మాట్లాడుతూ.. ట్రంప్ పై మండిపడ్డాడు. ఇది పనికిరాని, చౌకబారు రాజకీయ ప్రచారంగా అభివర్ణించాడు. జెఫ్రీ ఎప్స్టీన్ రహస్య క్లయింట్ జాబితాను విడుదల చేస్తానని హామీ ఇచ్చి ఇంకా అలా చేయకపోవడంతో వివాదం నుండి దృష్టి మరల్చడానికే ఈ ప్రకటన చేశారని ఆయన అన్నారు. వెనిజులా గౌరవం అమ్మకానికి లేదని గిల్ నొక్కిచెప్పారు.

అమెరికా, వెనిజులా మధ్య ఈ వివాదం కొత్తది కాదు. 2020 నుంచి మదురోపై నార్కో టెర్రరిజం, కొకైన్ స్మగ్లింగ్ ఆరోపణలు ఉన్నాయి. అమెరికా అతనిపై ఆర్థిక ఆంక్షలు విధించింది. దౌత్యపరమైన ఒత్తిడిని కూడా తెచ్చింది. అయినప్పటికీ 2024లో మదురో తిరిగి వెనెజులా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అమెరికా, యూరోపియన్ యూనియన్, అనేక లాటిన్ అమెరికన్ దేశాలు ఈ ఎన్నికలను రిగ్గింగ్ గా అభివర్ణించాయి.