US Elections 2020 : ఎదురుపడనున్నట్రంప్, జో బిడెన్ అభ్యర్థుల మధ్య తొలి చర్చ

  • Published By: madhu ,Published On : September 30, 2020 / 06:26 AM IST
US Elections 2020 : ఎదురుపడనున్నట్రంప్, జో బిడెన్ అభ్యర్థుల మధ్య తొలి చర్చ

Updated On : September 30, 2020 / 10:25 AM IST

US Elections 2020 : అమెరికాలో అధ్యక్ష ఎన్నికల యుద్ధం చివరి దశకు చేరుకున్నది. రిపబ్లిక్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ అభ్యర్థి జో బిడెన్ కాసేపట్లో మొదటి అధ్యక్ష చర్చకు హాజరుకానున్నారు. మొత్తం మూడు చర్చలు జరుగనున్నాయి. మొదటి అధ్యక్ష చర్చ క్లీవ్‌ల్యాండ్‌ లోని కేస్ వెస్ట్రన్ రిజర్వ్ విశ్వవిద్యాలయం ఆవరణలో గంటన్నర పాటు జరుగనున్నది.



ఇందులో 6 సమస్యలపై చర్చ జరుగుతుంది. 24 రోజుల వ్యవధిలో మిగతా రెండు చర్చలు కూడా జరగనున్నాయి. రెండవ చర్చ మయామిలో అక్టోబర్ 15న, మూడవ చర్చ బెల్మాంట్ విశ్వవిద్యాలయంలో అక్టోబర్ 22న జరగనుంది. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3న జరగనున్నాయి.



ప్రెసిడెన్షియల్ డిబేట్ నేటి చర్చతో మరో రేంజ్‌కి వెళ్లబోతుంది. దీంతో ట్రంప్, జో బైడెన్‌లో ఎవరు సత్తా చాటుతారనేది ఆసక్తికరంగా మారింది. ఓ వైపు ట్రంప్ తన వాడి వేడి మాటలతో వ్యక్తిగత దాడికే పరిమితం అవుతుండగా.. జో బైడెన్ మాత్రం జాతీయ సర్వేల్లో ఆధిపత్యం సాధించిన ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు.



ఇంతకీ ఈ ఇద్దరిలో ఎవరు గెలిస్తే మన భారత సంతతికి ఉపయోగం.. ఎవరి విధానం మన వాళ్లకు అనుకూలంగా ఉండబోతోంది అనేది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు ట్రంప్, బైడెన్ ఇద్దరూ భారతీయుల ఓట్ల కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.



కరోనా వైరస్ కారణంగా ఈసారి చర్చ కార్యక్రమంలో కొన్ని మార్పులు చేశారు. చాలా తక్కువ మంది ప్రేక్షకులను మాత్రమే కార్యక్రమానికి అనుమతించనున్నారు. మాస్కులు లేకుండానే మోడరేటర్లు, అభ్యర్థులు చర్చ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వేదిక వద్ద ట్రంప్ భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా కూడా హాజరుకానున్నారు. అలాగే ఉపాధ్యక్ష చర్చను అక్టోబర్ 7న కింగ్స్‌వ్రే హాల్‌లోని ఉటా యూనివర్శిటీ ఆఫ్ సాల్ట్ లేక్ సిటీలో నిర్వహించనున్నారు.



ఎన్నికలకు కేవలం ఐదు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక నేషనల్‌ అప్రూవల్‌ రేటింగ్స్‌లో అధ్యక్షుడు ట్రంప్ కంటే 10 పాయింట్లు ముందంజలో జో బిడెన్‌ ఉన్నారు. అంటువ్యాధులు, ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలపై వారికి ఎక్కువ మద్దతు లభిస్తుందని నమ్ముతున్నారు. అయితే, ట్రంప్ త్వరలో కొవిడ్ -19 ను అధిగమిస్తారని, అప్పుడు రేటింగ్స్‌ పెరుగుతుందని కొంతమంది ఓటర్లు నమ్ముతున్నారు.

అధ్యక్ష చర్చలో ఆసక్తికర అంశాలు

162 ఏళ్ల కిందట అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య మొదటి చర్చ
1858లో అబ్రహం లింకన్, స్టీఫెన్ డగ్లస్ మధ్య తొలి అధ్యక్ష చర్చలు
1964లో చర్చలో పాల్గొనేందుకు నిరాకరించిన అప్పటి అధ్యక్షుడు లిండన్ జాన్సన్



1968, 1972లో అధ్యక్ష అభ్యర్థుల మధ్య చర్చలు జరగలేదు
చర్చలో పాల్గొనేందుకు రిచర్డ్ నిక్సన్ రెండు సార్లు నిరాకరించారు
1976లో చర్చలో పాల్గొన్న జిమ్మీ కార్టర్, జెరాల్డ్ ఫోర్డ్
అప్పటి నుంచి నిరంతరాయంగా కొనసాగుతోన్న చర్చ
1992లో చర్చలో పాల్గొన్న ముగ్గురు అభ్యర్థులు
జార్జ్ బుష్, బిల్ క్లింటన్, ఇండిపెండెంట్ రాస్ పారోట్ మధ్య జరిగిన చర్చ
చర్చ నిర్వహించేందుకు 1988లో ఏర్పడిన కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్