Donald Trump : భారత్‌కు ట్రంప్ స్వీట్ వార్నింగ్.. అధిక సుంకాలు తగ్గించకుంటే.. మేం కూడా అదే చేస్తాం..!
Donald Trump : అమెరికా ఉత్పత్తులపై భారత్ పన్నులు తగ్గించకుంటే అమెరికా కూడా భారతీయ ఉత్పత్తులపై పన్నును పెంచుతుందని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్నారు.

Trump Says India Charges A Lot Of Tariff, Threatens To Impose Reciprocal Tax
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అతి త్వరలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ భారత్‌కు స్పీట్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా ఉత్పత్తులపై భారత్‌తో పాటు ఇతర దేశాలు పన్నులు తగ్గించకపోతే.. దానికి ప్రతిగా అమెరికా కూడా తమ ఉత్పత్తులపై అదే పన్ను విధిస్తుందని ట్రంప్ అన్నారు. ఇదే జరిగితే.. భారత్-అమెరికా మధ్య పరస్పర వాణిజ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాదు.. ఇరుదేశాల మధ్య ఇప్పటికే ఉన్న వాణిజ్య సంబంధాలలో ఉద్రిక్తత మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.
డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. “భారత్ మనపై 100 శాతం సుంకం విధిస్తే.. మనం కూడా వారి వస్తువులపై అదే సుంకం విధించాలి.” భారత్, బ్రెజిల్ వంటి దేశాల పేరు చెప్పి.. అమెరికా వస్తువులపై తాము 100 శాతానికి పైగా సుంకం విధిస్తున్నామని, అయితే, అమెరికా అలా చేయడం లేదని ట్రంప్ స్పష్టం చేశారు.
ట్రంప్ ఇంతకుముందు కూడా భారతదేశాన్ని “టారిఫ్ కింగ్” అని పిలిచారు, ముఖ్యంగా హార్లే-డేవిడ్సన్ మోటార్‌సైకిళ్లపై విధించిన భారీ సుంకాల విషయంలో. ఆ తర్వాత భారత్ వాటిపై పన్ను తగ్గించినా.. ట్రంప్ మాత్రం సంతృప్తి చెందలేదు. ఈ సమస్య చాలా కాలంగా రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతకు కారణం.
800సీసీ కన్నా తక్కువ సామర్థ్యం ఉన్న హార్లే-డేవిడ్‌సన్ బైక్‌లపై భారత్ 50 శాతం కస్టమ్ డ్యూటీని హార్లే-డేవిడ్‌సన్‌పై విధించింది. దీని కన్నా ఎక్కువగా సీసీ బైక్‌లపై 75 శాతం పన్ను విధించారు. ఇంతకుముందు కస్టమ్ డ్యూటీ 100 శాతం వరకు ఉంది. అయితే, ట్రంప్ జోక్యం తర్వాత సవరించి తగ్గించారు. బైకుల విక్రయం సమయంలో ఈ బైక్‌లపై ప్రత్యేకంగా 28 శాతం జీఎస్టీ విధిస్తారు. జీఎస్టీ విధింపుతో అమెరికాకు ప్రత్యక్ష సంబంధం లేకపోయినా ఇంత పన్ను విధించడం వల్ల బైక్‌ల ధరలు గణనీయంగా పెరిగి డిమాండ్ తగ్గుతోంది.
అమెరికా విషయానికి వస్తే.. భారత్ ఎగుమతి చేసే వస్త్ర ఉత్పత్తులపై 10 నుంచి 20 శాతం కస్టమ్ సుంకాన్ని విధిస్తుంది. ఇది కాకుండా ఆభరణాలపై 5 శాతం పన్ను ఉంటుంది. భారత్ నుంచి పెద్ద మొత్తంలో మందులు ఎగుమతి అవుతాయి. వీటిపై దాదాపు 6 శాతం పన్ను విధిస్తారు. మనీకంట్రోల్ డేటా ప్రకారం.. భారత స్టాక్ మార్కెట్లో టెక్స్‌టైల్, దుస్తులు పరిశ్రమకు చెందిన మొత్తం 210 షేర్లలో, 141 నష్టాల్లో ఉన్నాయి.
వాణిజ్య లెక్కలు ఏం చెబుతున్నాయంటే? :
ఇటీవలి సంవత్సరాలలో తలెత్తిన సుంకాల వివాదాలను మినహాయించి, భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు స్నేహపూర్వకంగానే ఉన్నాయి. 2023-24లో భారత్ యూఎస్ నుంచి సుమారు రూ. 3.5 లక్షల కోట్లు (42.2 బిలియన్ డాలర్లు) దిగుమతి చేసుకోగా, అమెరికాకు భారత్ ఎగుమతులు రూ. 6.5 లక్షల కోట్లు (77.52 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. భారత్ అతిపెద్ద ఎగుమతి మార్కెట్ అమెరికానే. ఇరుదేశాల వాణిజ్య సంబంధాలలో అంతరాయం ఏర్పడితే.. భారత్ ఐటీ, ఫార్మాస్యూటికల్, టెక్స్‌టైల్ పరిశ్రమలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.
భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై ట్రంప్ సుంకాలను పెంచితే.. అమెరికా మార్కెట్‌లో వాటి పోటీ తగ్గుతుంది. ముఖ్యంగా అమెరికా కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెంచుతున్న తరుణంలో భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపవచ్చు.
భారత్ ఏం చేయగలదంటే? :
ఏ దేశమైనా అమెరికా ఉత్పత్తులపై సుంకం విధిస్తే.. అమెరికా కూడా అదే నిష్పత్తిలో పన్ను విధిస్తుందని ట్రంప్ ప్రకటించారు. ఈ విధానం భారత్‌కు సవాలుగా ఉంటుంది. అయితే, ఇందులోనూ అవకాశాలు ఉన్నాయి. ట్రంప్ చైనా ఉత్పత్తులపై సుంకాలను పెంచినట్లయితే.. అప్పుడు భారతీయ కంపెనీలకు అమెరికన్ మార్కెట్లో చైనా ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా మారవచ్చు.
అయినప్పటికీ, భారత్ తన వాణిజ్య విధానాలను సమతుల్యం చేసుకోవాలి. దేశీయ పరిశ్రమను రక్షించడానికి సుంకాలను విధించవలసి ఉంటుంది. అయితే, అదే సమయంలో అతిపెద్ద ఎగుమతి మార్కెట్‌గా ఉండేలా చూసుకోవాలి. భారత్ అమెరికా ఉత్పత్తులపై సుంకాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. తద్వారా అది ట్రంప్‌ను రాజకీయంగా సంతృప్తిపర్చే అవకాశం ఉంది. ఫలితంగా, భారతీయ పరిశ్రమపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు.
Read Also : Russian Parliament : ‘ఉగ్రవాద జాబితా’ నుంచి తాలిబాన్ తొలగింపు బిల్లుకు రష్యా పార్లమెంట్ ఆమోదం