ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. అఫ్గానిస్థాన్, ఇరాన్ సహా 12 దేశాల పౌరులకు అమెరికాలోకి నో ఎంట్రీ..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 12దేశాల పౌరులు అమెరికా రాకపై నిషేధం విధించారు.

Donald Trump
Trump Travel Ban : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి పలు వివాదాస్పద, సంచలన నిర్ణయాలతో ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న ట్రంప్.. తాజాగా.. 12దేశాల పౌరులు అమెరికా రాకపై నిషేధం విధించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై ట్రంప్ సంతకంసైతం చేశారు.
12 దేశాలు ఇవే..
అఫ్గానిస్థాన్, ఇరాన్, యెమెన్, మయన్మార్, చాద్, కాంగో, ఈక్వెటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, లిబియా, సోమాలియా, సూడాన్ దేశాలు ఈ నిషేధ జాబితాలో ఉన్నాయి. ఈ పన్నెండు దేశాల పౌరులు ఇకనుంచి అమెరికాలో పర్యటించలేరు. ఈ ఉత్తర్వులు సోమవారం మధ్యాహ్నం 12గంటల నుంచి అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ అధికారులు తెలిపారు. మరోవైపు.. బురుండి, క్యూబా, లావోస్, సియెరా లియోన్, టోగో, తుర్కయేనిస్థాన్, వెనెజువెలా వంటి దేశాలపై పాక్షిక నిషేధం విధించారు. అయితే, ట్రంప్ చేసిన ఈ ప్రయాణ నిషేధానికి చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ట్రంప్ ఏం చెప్పారు..?
‘‘అమెరికా, దేశంలోని ప్రజల జాతీయ భద్రత, జాతీయ ప్రయోజనాలను కాపాడటానికి నేను ఈ చర్య తీసుకోవాలి’’ అని ట్రంప్ తన ప్రకటనలో తెలిపారు. కొలరాడోలోని బోల్డర్ కౌంటీలో ఇటీవల ఉగ్రదాడి జరిగింది. సరైన పత్రాలు లేని విదేశీ పౌరులు దేశంలో ఉండటం కారణంగానే మన మాతృభూమిలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. 2017లో యూరప్ లో జరిగిన విధంగా అమెరికాలో జరగనివ్వం. సురక్షితం కాని దేశాల నుంచి బహిరంగ వలసలను ఇక అనుమతించలేము. అందుకే ఆయా దేశాల ప్రయాణికులపై నిషేధం విధించే ఉత్తర్వులపై సంతకం చేస్తున్నా అంటూ ట్రంప్ ఓ వీడియోలో పేర్కొన్నారు.
ఆ దేశాలపై నిషేధం ఎందుకు..?
కొలరాడోలో ఇటీవల యూదులపై సీసాబాంబులతో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, జనవరి 20న ట్రంప్ ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేశారు. అమెరికా పట్ల శత్రువైఖరిని ప్రదర్శించే దేశాలపై నివేదికను సిద్ధం చేయాలని సూచించారు. కొన్ని దేశాల నుంచి వచ్చే పౌరులు అమెరికా జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తున్నారో లేదో తెలుసుకోవాలని రాష్ట్ర, హోంల్యాండ్ సెక్కూరిటీ విభాగాలు, జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ను ట్రంప్ కోరారు. ఈ నివేదిక తరువాత 12దేశాలపై పూర్తి నిషేధం, ఏడు దేశాలపై కఠినమైన ఆంక్షలు విధిస్తూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలోనూ ఇలా..
ట్రంప్ మొదటిసారి పదవి చేపట్టిన సమయంలోనూ ఏడు ముస్లీం దేశాలపై నిషేధం విధించారు. ఈ మేరకు 2017 జనవరిలో ఒక కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. ఇరాక్, సిరియా, ఇరాన్, సూడాన్, లిబియా, సోమాలియా, యెమెన్ పౌరులు అమెరికాలోకి రావడాన్ని నిషేధించారు. అయితే, ఈ నిషేధానికి సంబంధించి ట్రంప్ అనేక చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొన్నారు. 2018లో ఈ నిర్ణయాన్ని అమెరికా సుప్రీంకోర్టు కూడా సమర్థించింది.
ట్రంప్ నిర్ణయంపై వెనిజువెలా మంత్రి స్పందన..
ట్రంప్ తాజా నిర్ణయంపై వెనిజువెలా మంత్రి డియోస్టాడో కాబెల్లో స్పందించారు. యూఎస్ లో ఉండటం వెనిజువెలా ప్రజలకు మాత్రమే కాదు.. ఎవరికైనా ప్రమాదమే అని అన్నారు. అగ్రరాజ్యంలో పర్యటించవద్దు అంటూ వెనిజువెలా దేశ ప్రజలకు ఆయన సూచించారు.