మరణశిక్ష పడేదాకా ఇటువంటి వారిని వదలను: డొనాల్డ్ ట్రంప్
బైడెన్ తీసుకున్న నిర్ణయానికి అర్థం లేదని చెప్పారు.

Donald Trump
మరణశిక్ష పడ్డ 37 మంది ఖైదీలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ క్షమాభిక్ష ప్రసాదించడంపై డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డొనాల్డ్ ట్రంప్ వచ్చే నెల అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అమెరికా అధ్యక్ష పదవి నుంచి వచ్చే నెల బైడెన్ దిగిపోతారు.
అమెరికాలో ఫెడరల్ కోర్టులు 40 మందికి మరణశిక్ష విధిస్తే, వారిలో 37 మంది శిక్షను తగ్గించినట్లు బైడెన్ సోమవారం చెప్పారు. దీంతో వారికి అమలు చేయాల్సిన మరణశిక్ష ఇక యావజ్జీవ కారాగార శిక్షగా మారింది. ఆ ఖైదీల్లో మిలటరీ అధికారుల హంతకులతో పాటు మాదక ద్రవ్యాల స్మగ్లర్లు వంటి తీవ్ర నేరాలను పాల్పడ్డవారు ఉన్నారు.
దీనిపై డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ప్లాట్‌ఫాంలో ఓ పోస్ట్ చేశారు. “జో బైడెన్ అమెరికాలోని 37 మంది అత్యంత క్రూరమైన హంతకుల మరణశిక్షను తగ్గించారు” అని చెప్పారు. ఆ హంతకులు పాల్పడ్డ నేరాల గురించి ప్రజలు తెలుసుకుంటే, బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని నమ్మలేకపోతారని అన్నారు. బైడెన్ తీసుకున్న నిర్ణయానికి అర్థం లేదని చెప్పారు.
బాధితుల బంధువులు, స్నేహితులు మరింత కుంగిపోయారని అన్నారు. ఇలా జరిగిందని వారు నమ్మలేకపోతున్నారని తెలిపారు. అమెరికాలోని కుటుంబాలు, పిల్లలను రేపిస్టులు, హంతకులు, నరరూప రాక్షసుల నుంచి రక్షించడానికి మరణశిక్షను సీరియస్‌గా కొనసాగించాలని తాను న్యాయ శాఖను ఆదేశిస్తానని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.