ట్రంప్ ఆశలు ఆవిరి.. టాటా బైబై ఖతం.. చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసినప్పటికీ “నోబెల్” ఎందుకు రాలేదంటే?
ట్రంప్ ఇకపై నోబెల్ శాంతి బహుమతి 2026పై ఆశలు పెట్టుకుంటారేమో..

Donald Trump
Donald Trump: నోబెల్ శాంతి బహుమతి 2025పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరి అయ్యాయి. “నిజానికి నాకు నాలుగైదు సార్లు నోబెల్ శాంతి బహుమతి రావాలి” అంటూ ట్రంప్ కొన్ని వారాల క్రితం వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
నోబెల్ కమిటీ కేవలం ఉదారవాదులకు మాత్రమే బహుమతులు ఇస్తారని, అందుకే తనకు ఇవ్వరని కూడా ముందుగానే ట్రంప్ అన్నారు. అయినప్పటికీ నోబెల్ శాంతి బహుమతి 2025 కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు.
అంతన్నాడింతన్నాడు..
భారత్-పాకిస్థాన్ మధ్య అణు యుద్ధాన్ని ఆపానని కూడా ట్రంప్ తనకు తానే ప్రకటించుకున్నారు. ఆ తర్వాత ట్రంప్‌నకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పాక్ కూడా నామినేషన్ పంపించింది. భారత్, పాక్ మధ్య డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారని చెప్పింది.
మరోవైపు, ట్రంప్‌తో తమకు ఉన్న అవసరాల దృష్ట్యా ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు కూడా ఆయనకు నోబెల్ శాంతి బహుమతి 2025 ఇవ్వాలని అన్నారు. ఈ మేరకు వైట్‌హౌస్‌కు వెళ్లిన సమయంలో ఇజ్రాయెల్ నోబెల్ నామినేషన్ పత్రాన్ని ట్రంప్‌నకు నెతన్యూహు స్వయంగా ఇచ్చారు.
Also Read: ట్రంప్‌కి భారీ షాక్.. మారియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి 2025.. ఎవరు ఈమె? ఏం చేశారు?
ఘర్షణలు చోటుచేసుకుంటున్న దేశాలకు సంబంధించిన మరికొందరు నేతలు కూడా ఇదే పనిచేశారు. కంబోడియాతో పాటు అర్మేనియా, రువాండ, అజర్ బైజాన్ వంటి దేశాధినేతలు ట్రంప్‌నకు ఈ విషయంలో సపోర్ట్ చేశారు.
ప్రపంచంలోని మిగతా దేశాల నుంచి ట్రంప్‌నకు మద్దతు రాలేదు. అమెరికా నుంచి కూడా ట్రంప్‌నకు సపోర్టు దక్కలేదు. ఆయన అందుకు అర్హుడు కాదని 76 శాతం అమెరికన్లు భావిస్తున్నారని ఓ సర్వేలో తేలింది.
ప్రపంచంలో పలు దేశాల మధ్య ట్రంప్ చేసిన అనేక ఒప్పందాలు స్థిరమైన శాంతికి దారి తీయలేదు. ఉత్తర కొరియాతో చర్చలు విఫలమయ్యాయి. ఉత్తర కొరియా వైఖరిలో మార్పు రాలేదు.
ఇరాన్, చైనాతో పాటు మిత్రదేశాలపై కూడా ట్రంప్ చేసిన బెదిరింపులు నోబెల్ శాంతి బహుమతి లక్ష్యాలకు విరుద్ధంగా ఉన్నాయి. ట్రంప్ పలు అంతర్జాతీయ శాంతి ఒప్పందాల నుంచి కూడా తప్పుకున్నారు. మరోవైపు, ట్రంప్‌నకు నోబెల్ శాంతి బహుమతి 2025 కోసం ఆయన కార్యవర్గం లాబీయింగ్ కూడా చేసింది.
నోబెల్ కమిటీ ఏమంది?
డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వంపై నోబెల్ కమిటీ బహిరంగంగా వ్యాఖ్యలు చేయలేదు. అయితే, ఆయనకు శాంతి బహుమతి 2025 ఇస్తారన్న ప్రచారాలపై మాత్రం ఆ కమిటీ కార్యదర్శి క్రిస్టియన్ బెర్గ్ హర్ప్వికెన్ మాట్లాడారు. అందులోనూ డొనాల్డ్ ట్రంప్ పేరును ప్రస్తావించలేదు.
ప్రత్యేకమైన అర్హతలు ప్రతి నామినీకి ఉన్నాయని, అంతేగానీ, బయట జరుగుతున్న ప్రచారాలు తమ చర్చలపై ప్రభావం చూపవని స్పష్టం చేశారు. ఈ కమిటీని నార్వే పార్లమెంట్ నియమిస్తుంది. ఈ కమిటీలో ఐదుగురు సభ్యులు ఉంటారు. వారే పూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తూ నామినేషన్లను పరిశీలిస్తారు.
ఇటీవల, ఇజ్రాయెల్-గాజా మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి 2025 ఎంపికపై మాత్రం ఇది ఎలాంటి ప్రభావం చూపదని నార్వే నోబెల్ కమిటీ ఇప్పటికే తెలిపింది. ట్రంప్ ఇకపై నోబెల్ శాంతి బహుమతి 2026పై ఆశలు పెట్టుకుంటారేమో..