ట్రంప్ 3 గంటల పర్యటనకు రాష్ట్రంలో రూ. 100 కోట్లు ఖర్చు!

  • Published By: sreehari ,Published On : February 15, 2020 / 02:16 PM IST
ట్రంప్ 3 గంటల పర్యటనకు రాష్ట్రంలో రూ. 100 కోట్లు ఖర్చు!

Updated On : February 15, 2020 / 2:16 PM IST

వచ్చేది ఎవరు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రాకరాక ఇండియాకు వస్తున్నారు. ఏర్పాట్లు మాములుగా ఉంటే సరిపోదు కదా.. ఆయన హైప్రొఫైల్ కు తగ్గట్టుగా ఉండాలి.. అందులోనూ అగ్రరాజ్యానికి అధ్యక్షుడు కదా.. అందుకే రెడ్ కార్పెట్ రెడీ చేసింది గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం. ఖర్చుకు ఎంతమాత్రం వెనకడాట లేదు. అహ్మదాబాద్‌లో ట్రంప్ ఉండేది కేవలం 3 గంటలు మాత్రమే. కానీ, ట్రంప్ పర్యటనలో ఏ లోటు లేకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్ల విషయంలో ఎక్కడా తగ్గేట్టు కనిపించడం లేదు.

ట్రంప్ కోసం రెడ్ కార్పెట్ ఏర్పాటు చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం.. ట్రంప్ ఫిబ్రవరి 24న అహ్మదాబాద్ లో పర్యటించనున్నారు. అంచనా ప్రకారం.. రాష్ట్రప్రభుత్వం ట్రంప్ పర్యటన కోసం దాదాపు రూ.100 కోట్లు వరకు ఖర్చు చేస్తుందంట. ట్రంప్ అహ్మదాబాద్ పర్యటనకు సంబంధించి ప్రణాళికలను రూపొందించి వాటిని సక్రమంగా ఏర్పాట్లు జరిగేలా అధికారులను రంగంలోకి దించినట్టు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఒక ప్రకటనలో తెలిపారు.

ట్రంప్ పర్యటనకు సంబంధించి బడ్జెట్ అనేది ఎంతమాత్రం అవరోధం కాదని ఆయన అధికారులకు సూచించినట్టు తెలిసింది. ట్రంప్ వస్తున్నాడని.. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (AMC), అహ్మదాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (AUDA) సంయుక్తంగా రోడ్లన్నీ మరమ్మత్తులు చేస్తూ నగరమంతా అందంగా తీర్చిదిద్దుతున్నారు. దీనికోసం దాదాపు రూ.100 కోట్లు వరకు ఖర్చు చేస్తున్నట్టు రాష్ట్ర వర్గాలు తెలిపాయి. షాహిబాగ్ లోని ఎయిర్ పోర్టు మార్గంగా ట్రంప్ వెళ్లే రోడ్లకు డివైడర్ల పక్కన పామ్ ట్రీలను నాటుతున్నారు. మొత్తంగా 17 రోడ్డు మార్గాల్లో గుంతలు లేకుండా కొత్తగా అందంగా తీర్చిదిద్దేందుకు రూ.60 కోట్లు వరకు ఖర్చు పెడుతున్నారంట.

మోటేరా స్టేడియం ప్రారంభించిన తర్వాత ఎయిర్ పోర్టుకు ట్రంప్ తిరిగి వెళ్లే మార్గంలో 1.5 కిలోమీటర్ల రోడ్డు పొడవునా కొత్త రోడ్లను వేయిస్తున్నారు. ఎయిర్ పోర్టు వెళ్లే మార్గంలో పావేర్ బ్లాక్లులను మార్చేశారు. రూట్లు.. ట్రంప్ వచ్చే వేదికను అందగా తీర్చిదిద్దేందుకు పురపాలక విభాగం రూ.6 కోట్ల బడ్జెట్ కేటాయించింది. రోడ్ల కోసం రూ.20 కోట్లను AUDA ఖర్చు పెట్టనుంది.

మొత్తంగా ట్రంప్ పర్యటనకు ప్రభుత్వం రూ.100 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. ఇందులో కొంత మొత్తం ఖర్చును భారత ప్రభుత్వం భరించవచ్చు. కానీ, పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు నగరంలో రోడ్లపై గుంతలను పూడ్చి మరమ్మత్తులను పూర్తి చేసేందుకు రూ. 500 కోట్లు మంజూరు చేసినట్టు AMC అధికారులు వెల్లడించారు.