ప్రభుత్వ ఆయిల్ కంపెనీపై డ్రోన్లతో దాడి

సౌదీ అరేబియాలోని ప్రభుత్వ చమురు ప్లాంట్ పై గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్లతో దాడి చేశారు. తూర్పు సౌదీ అరేబియాలోని సౌదీ ఆరాంకో ప్రాసెసింగ్ యూనిట్లే లక్ష్యంగా శనివారం డ్రోన్ దాడులు జరిగాయని అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది.
బుక్యాక్‌లోని ప్రాసెసింగ్ ప్లాంట్, ఖురైస్ చమురు క్షేత్రంపై జరిగిన ఈ దాడిలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ వ్యాపించింది. అయితే ఎలాంటి ప్రాణనష్టంలేదని తెలిపింది. ఆరాంకో భద్రతా దళాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయని వెల్లడించింది. ఇక్కడ రోజుకు 70 లక్షల బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ ప్రాసెస్ అవుతుందని అధికారులు తెలిపారు.
ఈ దాడిపై ఇప్పటివరకూ ఎవరూ బాధ్యత వహించలేదు. ఈ ప్లాంట్‌ను గతంలో ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. 2006లో అల్-ఖైదా ఆత్మాహుతి దళాలు ఈ చమురు సముదాయంపై దాడికి విఫలయత్నం చేశాయి.