Attack On School: దారుణం.. స్కూల్ పై దాడి.. 43 మంది పిల్లలు మృతి..

ఈ యుద్ధంలో 40వేల మందికి పైగా మరణించారు. కోటి 20లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

Attack On School: దారుణం.. స్కూల్ పై దాడి.. 43 మంది పిల్లలు మృతి..

Updated On : December 7, 2025 / 9:30 PM IST

Attack On School: దక్షిణ మధ్య సూడాన్‌లోని ఒక కిండర్ గార్టెన్‌ (స్కూల్) పై దాడి జరిగింది. ఈ దాడిలో 79 మంది చనిపోయారు. వీరిలో 43 మంది పిల్లలు ఉన్నారు. మరో 38 మంది గాయపడ్డారు. సూడాన్ పారామిలిటరీ దళాలు డ్రోన్ దాడికి పాల్పడ్డాయి. దక్షిణ కోర్డోఫాన్ రాష్ట్రంలోని కలోగి పట్టణంలో కిండర్ గార్టెన్ పై దాడి జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ దాడితో ఆ ప్రాంతంలో కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి.

తాజా దాడి.. పారామిలిటరీ గ్రూప్, రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ లేదా ఆర్‌ఎస్‌ఎఫ్ (RSF), రెండేళ్లుగా యుద్ధంలో ఉన్న సూడాన్ మిలిటరీ మధ్య జరుగుతున్న పోరాటంలో తాజాది. ఇదిప్పుడు చమురు సంపన్నమైన కోర్డోఫాన్ రాష్ట్రాలపై దృష్టి సారించింది.

సుడాన్‌లో ఆర్మీ, రెబల్స్ (పారా మిలిటరీ) మధ్య ఆధిపత్య పోరు పీక్స్ కి చేరింది. ఈ పోరులో వేలాది మంది అమాయకులు ప్రాణాలు వదులుతున్నారు. తాజాగా ఆర్మీ కంట్రోల్‌లో ఉన్న కలోగిపై రెబల్స్ డ్రోన్ దాడి చేశారు. రెబల్స్ తొలుత కిండర్‌ గార్టెన్ (స్కూల్), ఆస్పత్రిపై దాడి చేశారు. పిల్లలను రక్షించేందుకు బలగాలు ప్రయత్నిస్తుండగా మళ్లీ దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. “స్కూల్ పిల్లలను చంపడం పిల్లల హక్కులను తీవ్రంగా ఉల్లంఘించడమే అని సూడాన్ యునిసెఫ్ ప్రతినిధి షెల్డన్ తెలిపారు. ఆధిపత్య పోరులో పిల్లలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని వాపోయారు.

ఈ దాడులను వెంటనే ఆపాలని.. అవసరమైన వారికి మానవతా సాయం కోసం సురక్షితమైన, అడ్డంకులు లేని దారి ఏర్పరచాలని యునిసెఫ్ అన్ని పక్షాలను కోరింది. ఆధిపత్య పోరు కారణంగా గత కొన్ని వారాలలో కోర్డోఫాన్ రాష్ట్రాల్లో వందలాది మంది పౌరులు మరణించారు. ఆదివారం దక్షిణ కోర్డోఫాన్‌లోని కౌడాలో సూడాన్ సైనిక వైమానిక దాడుల్లో కనీసం 48 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది పౌరులు ఉన్నారు. ఎల్-ఫాషర్‌లో జరిగినట్లుగా కోర్డోఫాన్ కొత్త దురాగతాలను ఎదుర్కోవాల్సి రావచ్చని UN మానవ హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ హెచ్చరించారు.

ఎల్-ఫాషర్‌ను RSF స్వాధీనం చేసుకోవడమే కాదు.. మరణశిక్షలు విధించడం, అత్యాచారాలు, లైంగిక దాడులు వంటి దురాగతాలకు పాల్పడుతోంది. వేలాది మంది చంపబడ్డారని తెలుస్తోంది.

2023 నుండి సూడాన్ పై అధికారం కోసం ఆర్ఎస్ఎఫ్, సూడాన్ సైన్యం పోరాడుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఈ యుద్ధంలో 40వేల మందికి పైగా మరణించారు. కోటి 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని సహాయక బృందాలు చెబుతున్నాయి.

Also Read: ఉన్నవి చాలవన్నట్టు ఇంకో కొత్త వైరస్.. ఆల్రెడీ పాకడం మొదలైంది.. 13 మంది..