Russia Ukraine War : రష్యా-యుక్రెయిన్ మధ్య ఐదో రోజు భీకర పోరు..కీవ్‌ నగరం మా ఆధీనంలోనే ఉందన్న యుక్రెయిన్‌ ఆర్మీ

రష్యా యుద్ధంతో యుక్రెయిన్‌లోని 102 పౌరులు, ఏడుగురు చిన్నారులు మృతి చెందారని యూఎన్‌ ప్రకటించింది. అటు యుక్రెయిన్‌ ప్రజలను శరణార్థులుగా యుద్ధం మార్చుతోంది.

Russia Ukraine War : రష్యా-యుక్రెయిన్ మధ్య ఐదో రోజు భీకర పోరు..కీవ్‌ నగరం మా ఆధీనంలోనే ఉందన్న యుక్రెయిన్‌ ఆర్మీ

Ukrainne War

Updated On : February 28, 2022 / 4:46 PM IST

Russia Ukraine war : ఓ వైపు చర్చలు… మరోవైపు యుద్ధం… బాంబుల మోతతో యుక్రెయిన్ దద్దరిల్లిపోతోంది. రష్యా-యుక్రెయిన్ మధ్య ఐదో రోజు భీకర పోరు నడుస్తోంది. కీలకమైన కీవ్‌ నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా సైనికులు తీవ్రంగా ప్రయత్నిస్తుండగా… యుక్రెయిన్ ఆర్మీ కూడా దీటుగా ప్రతిఘటిస్తోంది. ఇప్పటివరకు కీవ్‌ నగరం తమ ఆధీనంలోనే ఉందని యుక్రెయిన్‌ ఆర్మీ ప్రకటించింది. కీవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా బలగాలు చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయ ప్రకటించింది. రష్యా యుద్ధంతో యుక్రెయిన్‌లోని 102 పౌరులు, ఏడుగురు చిన్నారులు మృతి చెందారని యూఎన్‌ ప్రకటించింది.

అటు యుక్రెయిన్‌ ప్రజలను శరణార్థులుగా యుద్ధం మార్చుతోంది. యుద్ధం మొదలయిన తర్వాత 4 లక్షల 22 వేల మంది పౌరులు యుక్రెయిన్‌ను విడిచి వెళ్లారని యూఎన్ తెలిపింది. మిస్సైల్స్, బాంబుల దాటికి వేలాది ఇళ్లు ధ్వంసం అయ్యాయని… లక్ష మందికి పైగా నిరాశ్రులయ్యారని యూఎన్‌ వెల్లడించింది. మరోవైపు యుక్రెయిన్‌కు ఆయుధాలు పంపేందుకు నాటో ముందుకొచ్చింది. డిఫెన్స్ మిస్సైల్స్, యాంటీ ట్యాంక్‌ వెపన్స్‌ను పంపిస్తామని ప్రకటించింది. యుక్రెయిన్‌కు ఫైటర్‌ జెట్లను పంపింది ఈయూ.

Ukraine : యుక్రెయిన్ రక్షణ శాఖ కీలక ప్రకటన

మరోవైపు రష్యా-యుక్రెయిన్ మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. బెలారస్‌ వేదికగా రెండు దేశాల ప్రతినిధులు చర్చలకు హాజరయ్యారు. యుక్రెయిన్ తరపున చర్చల్లో ఆ దేశ రక్షణమంత్రి పాల్గొన్నారు. తక్షణమే రష్యా యుక్రెయిన్‌పై దాడులు ఆపాలని… సైన్యాన్ని వెనక్కి పంపాలని చర్చలకు ముందు యుక్రెయిన్ డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య చర్చలు సాగుతున్నాయి. రష్యా- యుక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ముగుస్తుందో.. కొనసాగుతుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

అయితే కీవ్‌లోని ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లొచ్చని రష్యా అధ్యక్షుడు పుతిన్ సూచించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు దారులు తెరిచామని స్పష్టం చేశారు. తమ లక్ష్యం సామాన్య ప్రజలు కాదన్న పుతిన్… పౌరులపై దాడులు చేయమని చెప్పారు. రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌కు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కౌంటర్ ఇచ్చారు. రష్యా సైనికులు యుక్రెయిన్‌ను విడిచి తమ ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. అలాగే తక్షణమే తమకు ఈయూ సభ్యత్వం ఇవ్వాలని యుక్రెయిన్ డిమాండ్ చేస్తోంది. కీవ్‌లో కర్ఫ్యూ ఎత్తివేయడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తోన్నారు.

Russia-Ukraine : ఎట్టకేలకు రష్యా-యుక్రెయిన్ మధ్య ప్రారంభమైన చర్చలు

అయితే చర్చలకు ముందు బెలారస్ సంచలన ప్రకటన చేసింది. రష్యాపై ఆంక్షలు మరిన్ని పెంచితే… మూడో ప్రపంచయుద్ధం తప్పదని హెచ్చరించింది. చర్చలకు ముందు రష్యా, యుక్రెయిన్ చేసిన ప్రకటనలు తీవ్ర గందరగోళానికి గురిచేశాయి. యుక్రెయిన్‌ ఎయిర్‌స్పేస్ మొత్తం తమ ఆధీనంలో ఉందని రష్యా ప్రకటించింది. ఆ తర్వాత కాసేపటికే యుక్రెయిన్ భిన్నమైన ప్రకటన చేసింది. యుద్ధంలో నైతిక విజయం తమదేనని, రష్యా మానసిక స్థైర్యం కోల్పోయిందని, బలహీనపడిందని ఆరోపించింది.

పౌరుల నివాసాలపైనా రష్యా ఆర్మీ దాడులు చేసిందని, ఎన్ని విధాలుగా ప్రయత్నించినా యుక్రెయిన్‌ను ఆక్రమించుకోలేకపోయిందని ఆరోపించింది. అయితే యుక్రెయిన్ ఆరోపణలను తోసిపుచ్చింది రష్యా. ప్రజలను యుక్రెయిన్ ఆర్మీ మానవకవచంలా వాడుకుంటోందని ఎదురుదాడి చేసింది. రష్యా దళాలకు యుక్రెయిన్‌ నుంచి తీవ్ర ప్రతిఘటన ఉందని బ్రిటన్ అంటోంది. కీవ్‌కు 30కిలోమీటర్ల దూరంలోనే రష్యా బలగాలు నిలిచిపోయాయని బ్రిటన్ ప్రకటించింది.

Russia-Ukraine war : రష్యాపై పోరాటానికి యుక్రెయిన్ జైళ్లనుంచి ఖైదీల విడుదల

మరోవైపు యుద్ధం, ఆంక్షలతో రష్యా ఆర్థికవ్యవస్థ పతనమవుతోంది. ఇది భారంగా మారడంతో ఆర్థికవ్యవస్థను మెరుగుపరిచేందుకు కీలకనిర్ణయాలు తీసుకుంటోంది రష్యా. వడ్డీరేట్లను 9.5శాతం నుంచి ఏకంగా 20శాతానికి పెంచింది సెంట్రల్ బ్యాంక్. విదేశీ కరెన్సీలో ఉన్న ఆదాయాన్ని 80శాతం అమ్ముకుని రూబుల్ కొనాలనీ ఆదేశించింది.