ఇరాన్ రాజధానిలోని ఆసుపత్రిలో ఘోర ప్రమాదం, పేలుడు ఘటనలో 19మంది మృతి

ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. సినా అతర్ మెడికల్ క్లినిక్‌లో గ్యాస్ లీకై పేలుడు సంభవించింది. ఈ ఘటనలో క్లినిక్‌లో 19మంది చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు టెహ్రాన్ డిప్యూటీ గవర్నర్ హమీద్ రెజా చెప్పారు. మెడికల్ క్లినిక్‌లో గ్యాస్ లీకవడం వల్ల భారీ పేలుడు సంభవించిందన్నారు. పేలుడు ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. మెడికల్ క్లినిక్‌లో పేలుడు జరిగినపుడు 25 మంది ఉద్యోగులున్నారని, చిన్న శస్త్రచికిత్సలు సాగుతున్నాయని ఆసుపత్రి అధికారులు చెప్పారు. మంగళవారం(జూన్ 30,2020) సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది.
విపరీతమైన వేడి, దట్టమైన పొగ, ఊపిరాడక పలువురు మృతి:
రెండు గంటల పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. పేలుడు ధాటికి స్థానికులు ఉలిక్కిపడ్డారు. మంటలు ఎగిసిపడ్డాయి. ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. పేలుడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్లినిక్ బేస్ మెంట్ లో గ్యాస్ లీక్ కావడం వల్ల ప్రమాదం సంభవించింది. విపరీతమైన వేడి, దట్టమైన పొగ కారణంగా క్లినిక్ లో పని చేసే వారిలో కొంతమంది డాక్టర్లు, సిబ్బంది, పేషెంట్లు చనిపోయారని అధికారులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడుతో మంటలు ఎగిసిపడ్డాయి.
4 రోజుల వ్యవధిలో రెండో పేలుడు:
బిల్డింగ్ లోపల చిక్కుకున్న వారు తమను కాపాడాలని హాహాకారాలు చేశారు. విపరీతమైన వేడి, దట్టమైన పొగకు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కాగా 10 నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్ల శబ్దాలు విన్నట్టు స్థానికులు కొందరు చెబుతున్నారు. ఇరాన్ రాజధానిలోని మిలటరీ కాంప్లెక్స్ దగ్గర ఇటీవలే భారీ పేలుడు సంభవించింది. అది జరిగిన 4 రోజులకే ఇప్పుడు మెడికల్ క్లినిక్ లో పేలుడు ఘటన చోటు చేసుకుంది.