IMF Conditions To Pakistan: భారత్‌తో పెట్టుకోవద్దు.. పాకిస్తాన్‌కు IMF బిగ్ షాక్.. నిధుల మంజూరుకు 11 షరతులు..
ముఖ్యంగా పాక్ రక్షణ బడ్జెట్ ను నియంత్రించాలనే కండీషన్ పెట్టింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పాక్ తన రక్షణ బడ్జెట్ ను 12శాతం పెంచింది.

IMF Conditions To Pakistan: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు IMF బిగ్ షాక్ ఇచ్చింది. ఇప్పటికే భారత్ చేతిలో కోలుకోలేని దెబ్బ తిన్న పాక్ కు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఝలక్ ఇచ్చింది. ఆర్థిక సాయం విడుదల విషయంలో పాక్ కు 11 కొత్త షరతులు విధించింది. ఈ కండీషన్లతో మున్ముందు పాక్ కు మరిన్ని సవాళ్లు ఎదురు కానున్నాయి. ఇటీవలే తమకు ఆర్థిక సాయం చేయాలంటూ ఐఎంఎఫ్ ను పాక్ అభ్యర్థించింది. నిధులు మంజూరు చేసేందుకు ఐఎంఎఫ్ ఓకే చెప్పింది. ఇదే సమయంలో పలు కండీషన్లు పెట్టింది. వాటికి ఓకే చెబితేనే నిధులు మంజూరు చేస్తామంది.
భారత్ చేతిలో చావుదెబ్బ తిన్న పాక్ కు.. ఐఎంఎఫ్ పెట్టిన కండీషన్స్ తో మరో బిగ్ షాక్ తగిలినట్లైంది. ఆర్థిక సాయం అందుతుందని పాక్ ఆనందించేలోపే ఐఎంఎఫ్ పాక్ ఆశలపై నీళ్లు చల్లింది. తాము పెట్టిన కండీషన్లకు ఓకే చెప్పాలింది. పాక్ ఆర్థిక సంస్కరణ, పరిపాలన విభాగాల్లో షరతులు విధించింది. భారత్ తో ఇంకా ఉద్రిక్తతలు పెంచుకోవడం వల్ల పాక్ కే ఎక్కువ సమస్యలు వస్తాయని హెచ్చరించింది.
ఈ ఏడాది పాక్ పార్లమెంట్ ఆమోదించే బడ్జెట్ ఐఎంఎఫ్ కార్యక్రమ లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలి. ఆ బడ్జెట్ లో 1.07 ట్రిలియన్ రూపాయలను అభివృద్ధి ఖర్చుల కోసం కేటాయించాలని ఐఎంఎఫ్ కండీషన్ పెట్టింది. అటు పాక్ లో విద్యుత్ బిల్లులపై రుణ సేవ సర్ ఛార్జ్ లను పెంచాలని ఐఎంఎఫ్ ఆదేశించింది. ఇది పాక్ ప్రజలపై ఆర్థిక భారాన్ని మరింత పెంచే అవకాశం ఉంది.
Also Read: బాంబుల వర్షం, 100 మంది మరణం.. గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు..
అలాగే మూడేళ్ల కంటే పాత కార్ల దిగుమతిపై నిషేధం ఎత్తివేయాలని సూచించింది. పాక్ లోని 4 ప్రాంతాల్లో వ్యవసాయ ఆదాయ పన్ను చట్టాలను అమలు చేయాలని కండీషన్ పెట్టింది. దీని కోసం వెంటనే సమగ్ర ప్రణాళికను రూపొందించాలని సూచించింది. పాక్ లో పరిపాలన సంస్కరణలు చేయాలంది. దీని వల్ల దేశంలోని వ్యవస్థాగత లోపాలను పరిష్కరించవచ్చని, వెంటనే దీన్ని అమలు చేయాలని నిబంధన పెట్టింది.
అలాగే పాక్ లో పారిశ్రామిక వర్గాలకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను తొలగించాలంది. ముఖ్యంగా పాక్ రక్షణ బడ్జెట్ ను నియంత్రించాలనే కండీషన్ పెట్టింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పాక్ తన రక్షణ బడ్జెట్ ను 12శాతం పెంచింది. ఇప్పటివరకు పాక్ పై ఐఎంఎఫ్ షరతుల సంఖ్య 50కి చేరింది. పాక్ కు ఐఎంఎఫ్ ఇస్తున్న నిధులను అభివృద్ధికి కాకుండా ఉగ్రవాదులను పెంచి పోషించడానికి వినియోగిస్తోందని భారత్ ఆరోపించింది. పాక్ కు నిధులు మంజూరు చేస్తే పరోక్షంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినట్లే అవుతుందని భారత్ మండిపడింది.