రెండేళ్ల ప్రయత్నం ఫలించింది, జాక్ పాట్ కొట్టిన భారతీయుడు, లాటరీలో 20కోట్లు గెల్చుకున్నాడు

  • Published By: naveen ,Published On : September 5, 2020 / 09:15 AM IST
రెండేళ్ల ప్రయత్నం ఫలించింది, జాక్ పాట్ కొట్టిన భారతీయుడు, లాటరీలో 20కోట్లు గెల్చుకున్నాడు

Updated On : September 5, 2020 / 9:58 AM IST

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఏ రూపంలో వరిస్తుందో చెప్పలేము. ఒక్కసారి అదృష్టం వరించిందంటే చాలు లైఫ్ టర్న్ అయిపోతుంది. రాత్రికి రాత్రికి కోటీశ్వరులు అయిపోతారు. ఇప్పటికే చాలామంది విషయంలో ఇది జరిగింది. తాజాగా యూఏఈలోని భారతీయుడిని అదృష్టం వరించింది. లాటరీలో ఏకంగా 20కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు.

రెండేళ్లుగా లాటరీ టికెట్ కొంటున్నాడు:
పంజాబ్‌కు చెందిన గురుప్రీత్ సింగ్ (35) షార్జాలోని ఓ ఐటీ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్లుగా బిగ్ టికెట్ లాటరీ కొనుగోలు చేస్తున్న అతడిని ఎట్టకేలకు అదృష్టం వరించింది. సెప్టెంబర్ 3న ప్రకటించిన లాటరీ ఫలితాల్లో గురుప్రీత్ జాక్‌పాట్ కొట్టాడు. ఏకంగా 10 మిలియన్ దిర్హామ్స్ (దాదాపు రూ. 19.90 కోట్లు) గెలుచుకున్నాడు. ఈ మేరకు ‘ఖలీజ్ టైమ్స్’ తెలిపింది. అంత పెద్ద మొత్తం తగలడంతో గురుప్రీత్ ఆనందంతో గంతులేస్తున్నాడు. ఆ డబ్బుతో దుబాయ్‌లో మంచి ఇల్లు కొనుక్కుని పంజాబ్‌లో ఉంటున్న తన తల్లిదండ్రులను తన వద్దకు తీసుకొచ్చుకుంటానని గురుప్రీత్ తెలిపాడు.

దుబాయ్‌లో ఇల్లు కొంటా, తల్లిదండ్రులను తీసుకొస్తా:
కరోనా విపత్కర సమయంలో ఇంత భారీ మొత్తంలో డబ్బు గెల్చుకోవడం అదృష్టమనే చెప్పాలి. గురుప్రీత్ సింగ్ ఆగస్టు 12న రాఫెల్ లాటరీ టిక్కెట్
(067757 w) కొనుగోలు చేశాడు. ’కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాఫెల్ డ్రాను ఆన్‌లైన్ లో నిర్వహించారు. ఈ డ్రా టైమింగ్ కూడా నాకు తెలియదు. లాటరీ గెలుచుకున్నట్లు రాఫెల్ నిర్వాహకుల నుంచి ఫోన్ వస్తే ఫ్రాంక్ కాల్ అనుకున్నా. పైగా ఆ సమయంలో నేను ఆఫీస్ వర్క్‌లో బిజీగా ఉన్నా. చివరకు మీడియా రిపోర్టు చెక్ చేసుకుని నేను నిజంగానే రూ.20 కోట్ల లాటరీ గెలుచుకున్నట్లు నిర్దారణకు వచ్చాను’ అని సింగ్ తెలిపాడు. ఈ నేల నాకు అన్నీ ఇచ్చింది. ఇప్పుడు భారీ మొత్తాన్ని ఇచ్చింది. నమ్మలేకపోతున్నా అని గురుప్రీత్ అన్నాడు.

32ఏళ్లుగా దుబాయ్ లో నివాసం:
గురుప్రీత్ సింగ్ కుటుంబం గత 32 ఏళ్లుగా యూఏఈలోనే ఉంటోంది. గురుప్రీత్‌కు మూడేళ్లు ఉన్నప్పుడు వారి కుటుంబం యూఏఈకి వలస వెళ్లింది. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన అతని తల్లిదండ్రులు ప్రస్తుతం పంజాబ్‌లో ఉంటున్నారు. వారిని ఎప్పటికైనా తన దగ్గరికి తెచ్చుకోవాలనేది గురుప్రీత్ సింగ్ కల. అలాగే సొంత ఇల్లు కొనాలన్నది మరో డ్రీమ్. ఇప్పుడు ఆ రెండూ నెరవేరబోతున్నాయని గురుప్రీత్ ఆనందంగా చెప్పాడు.