Indians Alert: భారతీయులు ఇళ్లలోనే ఉండండి.. ఇరాన్ దాడులతో ఖతార్ లోని ఇండియన్స్ కు కీలక సూచనలు..
తమ దేశంలోని ఫోర్డో, నటాంజ్, ఎస్ఫహాన్ మూడు అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే.

Indians Alert: అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఖతార్ లోని అమెరికా సైనిక స్థావరాలపై అటాక్ చేసింది. అమెరికా మిలటరీ బేస్ పై మిస్సైళ్లు వేసింది. ఇరాన్ దాడులతో ఖతార్ లోని భారత రాయబార కార్యాలయం అలర్ట్ అయ్యింది. ఖతార్ లో ఉంటున్న భారతీయులకు కీలక సూచనలు చేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఖతార్ లో ఉంటున్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలంది. ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కోరింది. ఖతార్ అధికారులు అందించే మార్గదర్శకాలు, సూచనలు పాటించాలంది.
తమ దేశంలోని అణు స్థావరాలపై దాడి చేసిన అమెరికాపై ఇరాక్ ప్రతీకార దాడులకు దిగింది. మిడిల్ ఈస్ట్ లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు ప్రారంభించడంతో భారతీయులు ఆందోళన చెందుతున్నారు. ఖతార్, బహ్రెయిన్, కువైట్ దేశాల్లో భారతీయులు ఎక్కువగా ఉంటారు. తెలుగు ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. దాడుల నేపథ్యంలో వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. అటు ఇరాన్ దాడులతో ఖతార్, బహ్రెయిన్, యూఏఈ తమ గగనతలాలను మూసేశాయి.
అమెరికా వైమానిక స్థావరం అల్ ఉదీద్ లక్ష్యంగా ఇరాన్ జరిపిన దాడులను విజయవంతంగా అడ్డుకున్నట్లు ఖతార్ ప్రకటించింది. ఈ దాడిలో ఎలాంటి మరణాలు సంభవించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని తెలిపింది. తమ ఎయిర్ స్పేస్, భూభాగం సురక్షితంగా ఉన్నాయని, ఏదైనా ముప్పును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఖతార్ స్పష్టం చేసింది.
తమ దేశంలోని ఫోర్డో, నటాంజ్, ఎస్ఫహాన్ మూడు అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే. అమెరికా ఆరంభించింది మేము ముగింపు పలుకుతామంది. అన్నట్లుగా ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంభించింది. ‘ఆపరేషన్ బషారత్ అల్-ఫాత్’ (విజయ ప్రకటన లేదా ఆపరేషన్ శుభవార్త అంటారు) పేరుతో అమెరికా సైనిక స్థావరాలపై దాడులకు దిగింది ఇరాన్.
Also Read: అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడులు.. సైనిక స్థావరాలపై మిస్సైళ్లతో అటాక్..