Israel-Hamas ceasefire: ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై ఖతార్, అమెరికా ఏమన్నాయి?

గాజా తూర్పు ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ తన సైన్యాన్ని ఉపసంహరించుకుంటోంది.

Israel-Hamas ceasefire: ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై ఖతార్, అమెరికా ఏమన్నాయి?

Updated On : January 16, 2025 / 11:50 AM IST

ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఆ రెండు దేశాల మధ్య మధ్యవర్తులుగా వ్యవహరించిన అమెరికా, ఖతార్ దీనిపై వివరాలు తెలిపాయి. ఇజ్రాయెల్‌, హమస్‌ మధ్య కుదిరిన ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి వస్తుందని ఖతార్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్ థాని అన్నారు.

ఇందుకు ఇజ్రాయెల్ క్యాబినెట్‌ కూడా ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ ఒప్పందం యుద్ధం నిలిచేలా చేస్తుందని, దీంతో పాలస్తీనీయులకు కావాల్సిన మానవీయ సాయం అందుతుందని తెలిపారు. అలాగే, బందీలుగా ఉన్న వారు వారి కుటుంబ సభ్యులను కలుసుకుంటారని అన్నారు.

మరోవైపు, గాజాలో మాత్రం దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ తాజాగా దాడిలో 20 మంది ప్రజలు మృతి చెందినట్లు హమాస్ చెప్పింది. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల వల్ల మొత్తం కలిపి 23 లక్షల మంది నిర్వాసితులయ్యారని హమాస్ అంటోంది. తొలి దశ కాల్పుల విరమణకు ముందు ఇజ్రాయెల్, హమాస్‌ శాంతియుతంగా ఉండాలని షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్ థాని విజ్ఞప్తి చేశారు.

గాజా తూర్పు ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ తన సైన్యాన్ని ఉపసంహరించుకుంటోంది. ఇక రెండో, మూడో దశ చర్చల్లో మిగతా సమస్యలను పరిష్కరించుకుంటారు. ఈ దశలకు సంబంధించి స్పష్టమైన కార్యాచరణ సిద్ధంగా ఉందని మొహమ్మద్ తెలిపారు. ఖతార్, అమెరికాతో పాటు ఈజిప్టు దేశాలు ఆ ఒప్పందంలోని అంశాలను అమల్లోకి వచ్చేలా చూసుకుంటాయని చెప్పారు.

అమెరికా ఏమంటోంది?
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఒప్పందానికి సంబంధించిన ప్రణాళిక ఎనిమిది నెలల క్రితమే సిద్ధమైందని తెలిపారు. అయితే, అక్టోబర్ 7న హమాస్ దాడిలో మృతి చెందిన వారిని, వారి ఫ్యామిలీలను మర్చిపోలేమని అన్నారు.

బైడెన్‌ తన వీడ్కోలు ప్రసంగంలో మాట్లాడుతూ కూడా ఒప్పందంపై స్పందించారు. తాను గత ఏడాది మే నెలలో ప్రస్తావించిన విషయాలు ఈ ఒప్పందంలో ఉన్నాయని తెలిపారు. ఆ అంశాలను ఐక్యరాజ్యసమితి భద్రతామండలితో పాటు అనేక దేశాలు ఆమోదించాయని తెలిపారు.

తన కెరీర్‌లోనే చేసిన అత్యంత కఠినమైన డీల్‌ ఇదేనన్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టీమ్‌తోనూ సమన్వయం చేసుకుంటూ మిగతా దశల చర్చలు ముందుకుతీసుకెళ్లాలని తన టీమ్‌కి కూడా సూచించినట్లు తెలిపారు. ఈ ఒప్పందంలో డొనాల్డ్ ట్రంప్‌ పాత్ర లేదని అన్నారు. ఈ ఒప్పందం ఘనత ట్రంప్‌దా? బైడెన్‌దా? అని ఓ జర్నలిస్టు బైడెన్‌ను అడిగారు. దీంతో బైడెన్‌ స్పందిస్తూ జోక్‌ వేస్తున్నావా? అని అనడం గమనార్హం.

ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయాన్ని గురించి మొదట డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అనంతరం శ్వేతసౌధం, ఖతార్ ప్రకటనలు చేశాయి.

‘హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌’ను మూసివేస్తున్నాం: కంపెనీ ఫౌండర్‌ నాథన్‌ అండర్సన్‌