Israeli attack : హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులు.. 80శాతం రాకెట్లు ధ్వంసం
ఇరాన్ ప్రతిదాడి చేస్తే మా దెబ్బ ఇంకా గట్టిగా ఉంటుందని ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ ప్రతిదాడికి పాల్పడితే.. ఇరాన్ ను మళ్లీ ఎలా గట్టిగా దెబ్బకొట్టాలో

Israeli attack
Israel – Hezbollah conflict: పశ్చిమాసియా అట్టుడుకుతోంది. హమాస్, హెజ్‌బొల్లా స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు నిర్వహిస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం ఇజ్రాయెల్ దళాలు గాజాపై విరుచుకుపడ్డాయి. ఉత్తర గాజాలో బీట్ లాహియాలో ఓ నివాస భవనంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ ఘటనలో 55 మంది పాలస్తీయన్లు మరణించినట్లు పాలస్తీనా సివిల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ వెల్లడించింది. భవనాల శిథిలాల కింద చిక్కుకొని చాలా మంది గాయపడ్డారని పేర్కొంది. మరోవైపు గాజా, లెబనాన్ లో ఇజ్రాయెల్ భీకర దాడుల నేపథ్యంలో వందలాది మంది మృతి చెందారు. గాజా వ్యాప్తంగా 143 మంది, లెబనాన్ లో 77 మందికిపైగా మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
లెబనాన్ లో భూతల దాడులకు వెళ్లి ఇజ్రాయెల్ సైనికులు 33 మంది ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా.. నఖౌరాలోని తమ ఏజెన్సీ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన రాకెట్ దాడిలో శాంతి పరిరక్షకులు గాయపడ్డారని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ఇటీవల ఇరాన్ రాజధాని టెహ్రాన్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని సైనిక స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 100 ఫైటర్ జెట్స్ తో ఇరాన్ లోని 20 మిసైల్, డ్రోన్ ఫెసిలిటీ సెంటర్లపై మూడు రౌండ్ల ఎయిర్ స్ట్రైక్ ను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, డిఫెన్స్ మినిస్టర్ యోవ్ గాలెంట్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఇజ్రాయెల్ దాడికి తగిన గుణపాఠం చెబుతామని ఇరాన్ పేర్కొంది.
Also Read: Naim Qassem : హసన్ నస్రల్లా స్థానంలో హిజ్బుల్లా కొత్త చీఫ్‌గా నయీమ్ ఖాస్సేమ్ ఎన్నిక
ఇరాన్ ప్రతిదాడి చేస్తే మా దెబ్బ ఇంకా గట్టిగా ఉంటుందని ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ ప్రతిదాడికి పాల్పడితే.. ఇరాన్ ను మళ్లీ ఎలా గట్టిగా దెబ్బకొట్టాలో బాగా తెలుసని ఇజ్రాయెల్ లెఫ్ట్నెంట్ జనరల్ హెర్జి హలేవి హెచ్చరించారు. అయితే, గత వారం క్రితం ఇరాన్ పై జరిపిన దాడిలో కావాలనే కొన్ని లక్ష్యాలను పక్కన పెట్టామని, వాటిపై మరో సందర్భంలో గురిపెడతామని ఆయన తెలిపారు.
లెబనాన్ లోని హెజ్ బొల్లా స్థావరాలపై తీవ్రస్థాయిలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. యుద్ధ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ఈ మిలిటెంట్ సంస్థకు చెందిన 80శాతం రాకెట్లను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ అంచనా వేసింది. ఆ ముఠా వద్ద ఇంకా 20శాతం రాకెట్లు, క్షిపణులు మాత్రమే ఉన్నాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) నివేదికను అందజేసింది.